
వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం
ధర్పల్లి: ఒకప్పుడు డ్రోన్‌లను ఆర్మీ, నిఘా సంస్థలు మాత్రమే వాడేవి. మారుతున్న సాంకేతిక విప్లవంతో డ్రోన్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం విరివిగా జరుగుతుండగా, వ్యవసాయంలోనూ వాటి వాడకం పెరిగిపోయింది. పల్లెల్లోనూ రైతులు డ్రోన్‌లతో వ్యవసాయ పనులు చేస్తూ పనిభారం తగ్గించుకుంటున్నారు.
తగ్గనున్న ఖర్చులు..
రైతులు పంటలకు సకాలంలో ఎరువులు వేయడం, పురుగు మందులు చల్లడం లాంటి పనులు చేయడానికి కూలీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. కూలీలు సమయానికి రాకపోతే రైతు నష్టాలను భరించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు డ్రోన్‌ల రాకతో రైతులు కూలీల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి పల్లెల్లో డ్రోన్ వ్యవస్థ విస్తరించింది. కొందరు యువత జీవనోపాధి కోసం డ్రోన్‌లు కొనుగోలు చేసి ఆపరేటింగ్ చేస్తున్నారు. ఎకరానికి రూ.500 చొప్పున తీసుకొని కేవలం ఐదు నిమిషాల్లోనే ఎకరా భూమిలో క్రిమిసంహారక మందులను చల్లేస్తున్నారు. ఈ విధానంలో ఎరువులైన, మందులైన ఒకచోట ఎక్కువ, ఒకచోట తక్కువ కాకుండా సమానంగా పరుచుకుంటాయి. ఈ విధానంలో రైతుకి పురుగుమందు ఆదా అవడంతోపాటు పంట దిగుబడి పెరుగుతుంది. డ్రోన్ వినియోగం వల్ల రైతులకు కూలీల సమస్య తీరడంతోపాటు ఖర్చులు తగ్గుతున్నాయి. అలాగే డ్రోన్లను పంటలను పర్యవేక్షించడానికి కూడా వినియోగిస్తున్నారు.
స్వయం ఉపాధి పొందుతున్నా..
గల్ఫ్ దేశంలో పనిచేయడం ఇష్టం లేక, స్వయం ఉపాధి పొందాలనే ఆలోచనతో రూ.5 లక్షల వ్యయంతో డ్రోన్‌ను కొనుగోలు చేశాను. శిక్షణ తీసుకొని పొలాల్లో డ్రోన్‌తో మందుల పిచికారి చేస్తున్నాను. చార్జి ఒక ఎకరాకు రూ.500 తీసుకుంటున్నాను. రోజుకు 10 నుంచి 20 ఎకరాల వరకు స్ప్రే చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నాను.
–జీ రఘు, డ్రోన్ నిర్వాకుడు, గడ్కోల్
ఎంతో ఉపయోగం..
నాకు గ్రామంలో మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో పంటలకు పాత పద్ధతిలో మందుల పిచికారి చేయడానికి కూలీలతోపాటు స్ప్రే మెషిన్‌కు రూ.3వేలు వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు డ్రోన్ వల్ల రూ.పదిహేను వందలకే పూర్తవుతుంది. వ్యవసాయంలో డ్రోన్‌ను ఉపయోగించడం వల్ల కూలీలతోపాటు సమయం, శ్రమ, ఖర్చు బాగా తగ్గుతుంది.
– బి ప్రసాద్, రైతు, గడ్కోల్
పల్లెల్లో పంటలకు డ్రోన్‌లతో
మందులు పిచికారి చేస్తున్న వైనం
కూలీల కొరతకు చెక్

వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం

వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం