
ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ దీక్షలు
కామారెడ్డి క్రైం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్‌లు అమలు చేయకుండా ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ దీక్షలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందన్నారు. ముస్లిం లను బీసీల్లో కలపకుండా రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే మద్దతు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నారని ఇదివరకే కేంద్ర మంత్రులు స్పష్టం చేశారన్నారు. అయినప్పటికీ రిజర్వేషన్‌లను బీజేపీ ఆపుతోంది అంటూ కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేపట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలైన బీసీలకు అన్యాయం జరగకుండా ముస్లింలను బీసీ కోటా నుంచి తప్పించాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పొతంగల్ కిషన్‌రావు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.