అక్కా చెల్లెళ్లకు ఆర్టీసీ షాక్! | - | Sakshi
Sakshi News home page

అక్కా చెల్లెళ్లకు ఆర్టీసీ షాక్!

Aug 8 2025 9:25 AM | Updated on Aug 8 2025 12:54 PM

స్పెషల్‌ బస్సుల పేరుతో చార్జీ పెంపు

కామారెడ్డి నుంచి జేబీఎస్‌కు రూ.70 అదనం

రాఖీ పండగ సందర్భంగా అడ్డగోలు భారం

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పండగల సీజన్‌లో సాధారణంగా వస్తువుల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం పండగ సీజన్‌లో చార్జీలు అది కూడా 25 శాతం నుంచి 35 శాతం పెంచి ప్రయాణిలపై అడ్డగోలు భారం మోపుతోంది. గత కొంత కాలంగా పండగల సీజన్‌లో చార్జీలు పెంచి వసూలు చేస్తున్న ఆర్టీసీ ఆఖరుకు రాఖీ పండగ రద్దీని క్యాష్‌ చేసుకునేందుకు బాధుడు షురూ చేసింది. 

కామారెడ్డి నుంచి జేబీఎస్‌కు సాధారణంగా డీలక్స్‌ బస్సు చార్జీ రూ.230 ఉండగా, దానిని పండగ సందర్భంగా రూ.300కు పెంచేసింది. అదే మహారాష్ట్ర లోని నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు నడిచే బస్సు ఎక్కితే రూ.190 తీసుకుంటున్నారు. దానికి, దీనికి రూ.110 తేడా ఉంటోంది. కాగా హైదరాబాద్‌లో ఉంటున్న అక్కా చెల్లెల్లు కామారెడ్డికి రావాలన్నా, కామారెడ్డి ప్రాంతంలో ఉంటున్న అక్కాచెళ్లెల్లు హైదరాబాద్‌కు వెళ్లాలన్నా ఆర్టీసీ వడ్డనను భరించాల్సిందే. మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలనుకున్నా అరకొర బస్సులు నడుపుతున్నారు. 

ముఖ్యంగా కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులు తక్కువగా ఉండడంతో నిలబడి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో డీలక్స్‌ బస్సులు ఎక్కుతున్నారు. డీలక్స్‌ చార్జీ ఇప్పటికే రూ.230 దాకా ఉండగా, పండగ పేరుతో రూ.300 వసూలు చేయడం మహిళలకు మరింత భారంగా మారింది. మరికొన్ని రూట్లలోనూ స్పెషల్‌ పేరుతో చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ తీరుపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవ్వగారింటికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో ఇదేం దోచుకునుడు అంటూ నిష్టూరమాడుతున్నారు. తమ చేతిలో ఏమీ లేదని, అధికారులు ఏది చెబితే అది పాటిస్తామంటూ డ్రైవర్లు, కండక్టర్లు వారికి నచ్చజెప్పుతున్నారు.

కుటుంబాలపై ఎంతో భారం..

రాఖీ పండగ కోసం కుటుంబం మొత్తం బస్సులో సొంతూళ్లకు వెళ్లాలంటే అడ్డగోలు భారం మోయాల్సి వస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాలంటే అదనంగా రూ.280 భరించాల్సిన పరిస్థితి నెలకొంది. తిరిగి వెళ్లే సమయంలో మరో రూ.280 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డీలక్స్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం లేకపోవడం కారణంగా పూర్తి చార్జీ చెల్లించాల్సి రావడం భారం పడుతోంది. పండగల సందర్భంగా అందరూ ఆఫర్లు ఇచ్చి వస్తువుల ధరలు తగ్గిస్తే, ఆర్టీసీ సౌకర్యాలు కల్పించకపోగా, చార్జీలు పెంచి నడ్డివిరుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీల వడ్డనపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నోరువిప్పాల్సిన అవసరం ఉంది.

మహాలక్ష్మి పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ఆర్టీసీ అవసరం మేరకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులో ఉంచడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వాటిని పట్టించుకోని సంస్థ స్పెషల్‌ బస్సుల పేరుతో చార్జీల పెంపుపై ఆసక్తి చూపుతోంది. పండగ రోజుల్లో చార్జీలు పెంచే ఆర్టీసీ.. ఆడ బిడ్డలకు ఎంతో ప్రత్యేకమైన రాఖీ పౌర్ణమి సందర్భంగా డీలక్స్‌ బస్సు చార్జీలను పెంచింది. మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ప్రయాణిద్దామంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంటోందని, డబ్బులు చెల్లించి డీలక్స్‌ బస్సుల్లో వెళ్దామంటే టికెట్‌ చార్జీ పెంచేశారని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రాఖీ పండగకు పోవద్దా..

అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడి ఆత్మీయతను తెలిపే రాఖీ పౌర్ణమి పండగ కోసం ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా తల్లిగారింటికి పయనమవుతారు. ఒకటి రెండు రోజుల ముందే చాలా మంది బయల్దేరుతారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సెలవు దినం, శనివారం రాఖీ పౌర్ణమి, మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజులపాటు తల్లిగారింట గడపొచ్చని ఆడపిల్లలు ఎన్నో ఆశలతో బయల్దేరితే ఆర్టీసీ చార్జీల పెంపుతో చాలా మంది లబోదిబోమంటున్నారు. ఏడాదికోసారి వచ్చే రాఖీ పండగ పూట అన్నదమ్ములకు రాఖీ కట్టి ప్రేమను చాటుకునేందుకు వెళ్లాలంటే బస్సు చార్జీలు వారిని బాధిస్తున్నాయి. పండగకు ముందుగానే వెళ్తారని గ్రహించిన ఆర్టీసీ ముందుగానే చార్జీలను పెంచేసింది. కాగా పండగ కోసం తమ వారి వద్దకు వెళ్లేందుకు బస్సుల్లో బయల్దేరిన వారు ఒక్కసారిగా పెరిగిన చార్జీలను చూసి షాక్‌ అవుతున్నారు. కొందరైతే కండక్టర్లు, డ్రైవర్లతో గొడవకు దిగుతున్నారు. తామేం చేయలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారు. అయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏమోగానీ ఇతర బస్సుల చార్జీలను అడ్డగోలుగా పెంచిందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement