
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో గురువారం పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పునాదుల వరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లకు మొదటి విడత బిల్లులు మంజూరయ్యాయా అని వాకబు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సామగ్రికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా పనులను పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. ప్రారంభమైన అన్ని ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు.
ప్రభుత్వం ఉచితంగా ఇసుక,
మొరం అందిస్తోంది
అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచన
జిల్లా కేంద్రంలో పనుల పరిశీలన