
కంప్యూటర్ల మాయంలో ఎవరి హస్తమెంత?
బాన్సువాడ: ఇంటి దొంగను ఈశ్వరుడైడా పట్టుకోలేరనే సామెతకు అద్దంపట్టినట్లు ఉంది.. పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కంప్యూటర్ల మాయం చేయడమనేది. ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చలా తయారైంది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. కానీ కంప్యూటర్ గదిలో ఉండాల్సిన కంప్యూటర్లు మాత్రం మాయమయ్యాయి. వివరాలు.. తాడ్కోల్‌లో ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి అప్‌గ్రేడ్ కావడంతో 2024 ఫిబ్రవరిలో విద్యాశాఖ.. పాఠశాలకు పది కంప్యూటర్లను అందజేసింది. పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో కంప్యూటర్లను ఓ గదిలో ఉంచి తాళాలు వేశారు. కంప్యూటర్లు ఉన్న గదికి మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి.. తాళాలు వేసినట్లే ఉన్నాయి. కిటికీలు మూసి ఉంచారు. ఈ ఏడాది మార్చి 15న నుంచి ప్రైమరీ చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏఐఏఎక్స్‌ఎల్‌పై అవగాహన కల్పించాలని ఆదేశించింది.
కంప్యూటర్ల రికవరీపై మల్లగుల్లాలు
తాడ్కోల్ పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు ఏఐఏఎక్స్‌ఎల్ నేర్చించాలని కంప్యూటర్ గది తాళం తీశారు. గదిలో పది కంప్యూటర్లు ఉండాల్సిన చోట ఐదు కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్లు కనపడకపోవడంతో పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు విషయాన్ని దాచిపెట్టారు. విషయం ఆలస్యంగా బయటకి రావడంతో పాఠశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయుడు తన ఇంటికి తీసుకెళ్లిన ఒక కంప్యూటర్‌ను గుట్టుచప్పుడు కాకుండా పాఠశాలకు తెచ్చిపెట్టినట్లు తెలిసింది. మిగత నాలుగు కంప్యూటర్లపై విషయం తేలకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసప్పను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. మాయమైన కంప్యూటర్లను రికవరీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2013–2014 విద్యా సంవత్సరంలో బీర్కూర్ మండలం దామరంచ ఉన్నత పాఠశాలలో 10 కంప్యూటర్లు మాయమైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యాశాఖ అధికారులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దామరంచ ఉన్నత పాఠశాలలో మాయమైన కంప్యూటర్లకు, ప్రస్తుతం తాడ్కోల్ పాఠశాలలో మాయమైన కంప్యూటర్లపై లోతుగా విచారిస్తే అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.
బాధ్యుడిపై సస్పెన్షన్ వేటు వేసి
చేతులు దులుపుకున్న విద్యాశాఖ
మరో ఉపాధ్యాయుడి పాత్ర
ఉన్నట్లు అనుమానాలు
పోలీసులకు ఫిర్యాదు చేస్తాం
తాడ్కోల్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ల కనపడటం లేదు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసప్పపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేస్తాం. కనిపించకుండా పోయిన కంప్యూటర్లను రికవరీ చేస్తాం.
– నాగేశ్వర్‌రావు, ఎంఈవో, బాన్సువాడ

కంప్యూటర్ల మాయంలో ఎవరి హస్తమెంత?