
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చెవుటి పెద్ద గంగయ్య మూడు రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి, కామారెడ్డి మండలంలోని టెక్రియాల్‌లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించి బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అతడి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 50తులాల వెండి ఆభరణాలు, 2 తులాల బంగారు అభరణాలు, రూ.10వేల నగదును అపహరించారు. మరుసటి రోజు ఉదయం చోరీని గుర్తించి బాధితులు పోలీసులకు సమచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జర్నలిస్టు కాలనీలో..
బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని జర్నలిస్టు కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. కాలనీలో నివాసముంటున్న పట్లోళ్ల సుగణ అనే మహిళ శనివారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.2.50లక్షల నగదు చోరీ చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు.
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఖలీల్‌వాడి: నగర పరిధిలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు. చెరువులో గురువారం ఉదయం మృతదేహం పైకి తేలయంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.