‘ఇందిరమ్మ’లో కామారెడ్డి ఫస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’లో కామారెడ్డి ఫస్ట్‌

Aug 7 2025 7:26 AM | Updated on Aug 7 2025 7:30 AM

‘ఇందిరమ్మ’లో కామారెడ్డి ఫస్ట్‌

‘ఇందిరమ్మ’లో కామారెడ్డి ఫస్ట్‌

కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ సెక్రెటరీ, ఎండీ వీపీ గౌతమ్‌ తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. భిక్కనూరు, దోమకొండ మండలాల్లో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా చూడడంతోపాటు సకాలంలో బిల్లులు చెల్లించడం, క్లస్టర్‌ వారీగా అధికారులను నియమించి సమీక్షలు నిర్వహించడం, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిర్మాణాలను పర్యవేక్షిస్తుండడంతో కామారెడ్డి జిల్లా ఇందిరమ్మలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ దిశగా కృషి చేసిన కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ను, అధికార యంత్రాంగాన్ని అభినందించారు. భిక్కనూరులో మాదిరిగా ఫిల్టర్‌ రూఫ్‌ పద్ధతిలో నిర్మించుకుంటే నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా ఇల్లు వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చ గా ఉంటుందన్నారు. దీనిపై లబ్ధిదారులు, ఇందిర మ్మ కమిటీ సభ్యులు, మేసీ్త్రలకు అవగాహన కల్పించాలన్నారు. ఇసుక సమస్య రాకుండా హౌసింగ్‌, రెవెన్యూ, మండల పరిషత్‌ అధికారులు సమన్వయం చేసుకొని ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలన్నారు. రవాణా చార్జీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే చెల్లించేలా చూడాలన్నారు. మండల స్థాయి ధరల నియంత్రణ కమిటీల ద్వారా కంకర, ఐరన్‌, సిమెంటు, ఇటుకలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మట్టి గట్టిగా ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పిల్లర్స్‌ తప్పనిసరి కాదని పేర్కొన్నారు. మట్టి గట్టిగా ఉన్న చోట్ల ప్లింత్‌ బీమ్‌తో నిర్మాణం చేపట్టవచ్చన్నారు. లబ్ధిదారులుగా అనర్హులను ఎంపిక చేసినట్లు గుర్తిస్తే పనులు ఏ స్థాయిలో ఉన్నా నిలిపివేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సమస్యను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు.

11,883 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..

జిల్లావ్యాప్తంగా 12,090 ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. వాటిలో ఇప్పటివరకు 11,883 ఇళ్లు మంజూరు చేశామని, ఇందులో 5,721 ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,182 ఇండ్లు బేస్‌మెంట్‌ వరకు, 66 ఇండ్లు రూఫ్‌ స్ధాయి వరకు చేరాయన్నారు. ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యిందన్నారు. 2,111 ఇళ్లకు నిర్మాణ దశను బట్టి బిల్లులు చెల్లించామన్నారు. 431 మందికి మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను అందించామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్‌, చందర్‌ నాయక్‌, ఆర్డీవో వీణ, హౌసింగ్‌ పీడీ విజయ్‌పాల్‌రెడ్డి, డీఈ సుభాష్‌, ఏఈలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

అన్ని ప్రాంతాల్లో పిల్లర్లు

తప్పనిసరి కాదు

రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ సెక్రెటరీ,

ఎండీ వీపీ గౌతమ్‌

అనర్హులను ఎంపిక చేస్తే

చర్యలు తప్పవని హెచ్చరిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement