
కార్పొరేట్ శక్తులకు కేంద్రం వత్తాసు
కామారెడ్డి టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బుధవారం కామారెడ్డి వీక్లీ మార్కెట్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో సీపీఐ జిల్లా మూడో మహాసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుందని, ధనిక వర్గానికి మేలు చేస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలను విస్మరిస్తోందని విమర్శించారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నించే గొంతులు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, దేశ పౌరులను చంపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ధనికులు అంబానీ, అదానీకి మేలు చేసే విధంగా పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. దేశంలోని 90 శాతం నిరుపేదలను విస్మరిస్తూ, 10 శాతం ధనిక వర్గం కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ పని చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో భాగంగా పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి వీక్లీ మార్కెట్ వరకు ర్యాలీ తీశారు. మహాసభలలో ిసీపీఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ, రాష్ట్ర నాయకులు వీఎల్. నర్సింహారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్, ఉపాధ్యక్షులు బాలరాజ్, దుబాస్ రాములు, నాయకులు దేవయ్య, ఈశ్వర్, నాగమణి, మల్లేష్, రాజమణి, గంగాధర్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన
హామీలన్నీ అమలు చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు