
రైతు ఆత్మహత్యాయత్నం
గాంధారి: అటవీ భూమిలో సాగు చేసిన పంటను ధ్వంసం చేయడానికి అధికారులు గడ్డిమందు పిచికారి చేయగా.. ఆ భూమిని సాగు చేసిన రైతు ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతాయిపల్లి శివారులోని గండిమైసమ్మ కుంట అటవీ ప్రాంతంలో ఇరవై ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పంటలు పండిస్తున్నాడు. అతడికి అప్పులు ఉండడంతో ఆ భూమిని కుర్మ సంఘానికి అప్పగించి, ఊరు విడిచి వలసవెళ్లాడు. అదే సామాజికవర్గానికి చెందిన కోరె పెద్దమల్లయ్య, చిన్నమల్లయ్య ఆ భూమిని కౌలుకు తీసుకుని వరి వేశారు. బుధవారం అధికారులు ఆ పంటపై గడ్డిమందు పిచికారి చేయించారు. అనంతరం ఫిర్యాదు చేయడంకోసం అటవీ అధికారులు, రైతులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో చిన్నమల్లయ్య వరిపై పిచికారి చేసిన గడ్డి మందును వెంట తీసుకుని వెళ్లి స్టేషన్‌లో తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా అటవీ భూమిని ఆక్రమించి పంటలు సాగుచేస్తున్నారని, వారించబోగా తమపై దాడికి ప్రయత్నించారని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అరుణ.. కోరె మల్లయ్యతోపాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. తమ పంటలను కావాలని నాశనం చేశారని అటవీ అధికారులపై సీతాయిపల్లి రైతులు ఫిర్యాదు చేశారన్నారు.