
సదా మీసేవలో..
● వీపీవో వ్యవస్థ బలోపేతానికి చర్యలు
● పోలీసుల ఫోన్ నంబర్లతో వాల్‌రైటింగ్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో పోలీసుల పనితీరు మెరుగుపరిచేలా ఎస్పీ రాజేశ్ చంద్ర పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసుల సేవలు మరింతగా చేరువవ్వాలన్న ఉద్దేశంతో గ్రామ పోలీసు అధికారి (వీపీవో) వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. గ్రామ పోలీసు అధికారి ఆ గ్రామంలో అందరితో కాంటాక్ట్‌లో ఉండాలని, నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ పోలీసు అధికారులుగా పనిచేస్తున్న కానిస్టేబుళ్లు తమ ఫోన్ నంబర్లను ఆయా గ్రామాల్లో వివిధ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయించుకున్నారు. వాట్సాప్ గ్రూపులలో చేసే పోస్టింగులు, జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. వీపీవో వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద అందరికీ తెలిసేలా ‘సదా మీ సేవలో’ అంటూ గ్రామ పోలీసు అధికారి ఫోన్ నంబరు, పేరు, ఎస్సై ఫోన్ నంబరు, పోలీస్ స్టేషన్ ఫోన్‌నంబర్లను రాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వాల్‌రైటింగ్ చేపట్టారు. ఏ ఆపద ఉన్నా, ఏదైనా సమాచారం ఉన్నా పోలీసు అధికారులకు సమాచారం చేరేలా నంబర్లను ఊరూరా రాయిస్తున్నారు. తద్వారా గ్రామాల్లో జరిగే ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయ గొడవలు.. ఇలా అన్ని విషయాలు ముందుగానే పోలీసులకు తెలిసేందుకు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.