
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
కామారెడ్డి క్రైం: భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికై లింగంపేట్ మండలంలో గురువారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఇందులో భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సదస్సులలో భూ సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు సంయుక్తంగా సర్వే చేసి, అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అంతకు ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భూ భారతి విధి విధానాలను కలెక్టర్ వివరించారు. సమావేశంలో డీఎఫ్‌వో నిఖిత, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, అటవీ అభివృద్ధి అధికారి రామకృష్ణ, లింగంపేట్ తహసీల్దార్ సురేష్, ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట మండలంలో..
లింగంపేట: మండలంలో గురువారం నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ తెలిపారు. భూభారతి కోసం లింగంపేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత అన్ని గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఆర్డీవో ప్రకటించారు. 17న పోతాయిపల్లి, బోనాల్ గ్రామాలలో సదస్సు లు నిర్వహించనున్నారు. 19న బాయంపల్లి, కన్నాపూర్, 21న పర్మళ్ల, పొల్కంపేట, 22న ఎల్లారం, మెంగారం, 23న రాంపూర్, జల్దిపల్లి, 24న బాణాపూర్, కొర్పోల్, లింగంపల్లి(ఖుర్దు), 25న భవానీపేట, లింగంపేట, ముంబోజీపేట, 26న కంచుమల్, కొండాపూర్, 28న నల్లమడుగు, నాగారం, శెట్పల్లి సంగారెడ్డి, 30న శెట్పల్లి, మోతె గ్రామాల్లో సదస్సులు ఉంటాయి. రైతులు తమ భూసమస్యలను రెవెన్యూ సదస్సుల్లో అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆర్డీవో సూచించారు.
నేటినుంచి అవగాహన సదస్సులు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్