దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
కామారెడ్డి క్రైం: ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డులకోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది, అధికారులు వెరిఫికేషన్ చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ధరణి, ఎల్‌ఆర్‌ఎస్, రాజీవ్ యువ వికాసం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశీలనలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే జిల్లా పౌర సరఫరాల అధికారిని సంప్రదించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఉన్నతాధికారులకు సమర్పించాలన్నారు. అర్హత కలిగిన వారికి మార్క్ అవుట్ ఇవ్వాలన్నారు. ఇళ్లు నిర్మించుకోలేని నిరుపేదలకు స్వయం సహాయక బృందాల నుంచి రుణాలు ఇప్పించాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారుల రిమార్కులను నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. పునాది వరకు నిర్మించుకున్న వారి రిపోర్టులు, ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ చేస్తే మొదటి విడత నిధులు విడుదల చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీ చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ధరణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారుల సౌకర్యార్థం ప్రతి మండలంలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. హెల్ప్‌డెస్క్ సిబ్బంది దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేయాలన్నారు. ఆన్‌లైన్ చేసిన అనంతరం దరఖాస్తులను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. 15 వ తేదీ నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభించాలని అధికారులకు సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవో వీణ, డీఎస్‌వో మల్లికార్జున్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఆదాయ, కుల ధ్రువీకరణ
పత్రాలు త్వరగా జారీ చేయాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


