పొంచి ఉన్న కోవర్టుల ముప్పు | Sakshi
Sakshi News home page

పొంచి ఉన్న కోవర్టుల ముప్పు

Published Tue, Nov 14 2023 1:04 AM

- - Sakshi

ఆర్మూర్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కోవర్టులుగా వ్యవహరిస్తూ సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరాలకు చేరవేస్తున్న వారిపై అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల వద్ద కోవర్టుల తలనొప్పి ఉంది. స్థిరత్వం లేకుండా అభ్యర్థుల ప్రలోభాలకు లొంగి పార్టీలు ఫిరాయిస్తున్న వారితో పాటు ప్రస్తుతం ఉన్న పార్టీలోనే కొనసాగుతూ అక్కడి సమాచారాన్ని ప్రత్యర్థి శిబిరానికి ఎప్పటికప్పుడు చేరవేస్తూ కొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ అనుచరగణంతో చర్చించి ఏ గ్రామంలో ఎవరెవరిని పార్టీలో చేర్చుకోవాలి, ఎవరిని ప్రలోభాలకు గురి చేస్తే తమకు లాభం చేకూరుతుంది, మద్యం, విందులు, డబ్బుల పంపిణీ, పలు అంశాలపై చర్చించుకుంటున్నారు. అయితే ఆ చర్చల్లోనే ఉన్న కోవర్టులు సమయం చూసుకొని తమ ప్రత్యర్థి శిబిరాలకు సమాచారాన్ని చేరవేస్తున్నారు. దీంతో ప్రణాళిక సిద్దం చేసుకున్న అభ్యర్థి కంటే ముందుగానే ప్రత్యర్థి శిబిరానికి చెందిన నాయకులు వెళ్లి అక్కడి వ్యవహారాలను చక్కబెడుతూ వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. ఎవరైనా ఒక వ్యక్తి పార్టీకి చెందిన నాయకుడిని కలవడానికి వస్తే వెంటనే ఆ సమాచారాన్ని నిమిషాల వ్యవధిలో ప్రత్యర్థి శిబిరానికి చేరిపోతోంది. వెంటనే సదరు నాయకులు ఆ వ్యక్తికి లేదా అతని కుటుంబ సభ్యులను సంప్రదించి వారిని బుజ్జగించి పార్టీ ఫిరాయింపులను అడ్డుకుంటున్నారు. కుల సంఘాల ప్రతినిధులు ఇరు వర్గాల వారిని కలిసి లాభపడాలనే ఆలోచనతో వస్తే ఇలాంటి వారిని సైతం గుర్తించడానికి కోవర్టులు ఉపయోగపడుతున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు అభ్యర్థులు, ప్రత్యర్థుల ఎత్తులు, చిత్తులతో చిన్నసైజు యుద్ధాలనే తలపిస్తున్నాయి.

సమాచారాన్ని ప్రత్యర్థులకు

చేరవేస్తున్న కార్యకర్తలు

Advertisement
 
Advertisement