
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీచేస్తారన్న ప్రకటనతో నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఇదే సమయంలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడానికి ప్రగతిభవన్‌కు రావాలంటూ నియోజకర్గంలోని ముఖ్య నేతలకు పార్టీ అధిష్టానంనుంచి పిలుపువచ్చింది. ఈనెల 7న సమావేశం ఉంటుందని భావించారు.
అయితే నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశాల తర్వాతే ముఖ్య నేతలతో సీఎం సమావేశమవుతారని తెలుస్తోంది. దీంతో సీఎంతో సమావేశం కోసం బీఆర్‌ఎస్ నేతలు మరికొద్ది రోజులు ఆగాల్సిందేనన్న సంకేతాలు వచ్చాయి. కాగా ఈ నెల 3న హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తనయుడి వివాహానికి హాజరైన సీఎం.. గంటన్నర పాటు అక్కడే గడిపారు. పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఫొటోలు దిగేందుకు సమయం ఇవ్వడంతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగింది.
వందలాది మంది నేతలు, కార్యకర్తలు సీఎంతో ఫొటోలు దిగారు. గంప గోవర్ధన్ తన తనయుడి పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలేదు. ఒకటిరెండు రోజుల్లో ఆయన నియోజకవర్గానికి చేరుకుంటారని, తర్వాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది.