మున్సిపోల్స్‌కు సిద్ధం
బాన్సువాడ బల్దియాలో..
అత్యధికంగా కామారెడ్డిలో..
మున్సిపాలిటీల వారీగా తుది ఓటర్ల వివరాలు..
● వార్డులవారీగా ఓటర్ల జాబితా విడుదల
● అంతటా మహిళా ఓటర్లే అధికం
● నేడు పోలింగ్ స్టేషన్‌ల వివరాల ముసాయిదా జాబితా ప్రకటన
కామారెడ్డిలో తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తున్న అధికారులు
మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్కారు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా కీలకమైన ఓటరు జాబితాలను రూపొందించారు. వార్డులవారీగా జాబితాలను సోమవారం ప్రకటించారు. మంగళవారం అన్ని మున్సిపాలిటీలలో పోలింగ్ స్టేషన్‌ల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. 16వ తేదీన ఫొటోలతో కూడిన తుది జాబితాను విడుదల చేయనున్నారు.
మున్సిపాలిటీలలో ఈనెల ఒకటో తేదీన ముసాయిదా ఓటర్ల జాబితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డిలో ముసాయిదా ఓటరు జాబితాలోని గణాంకాలకు, తుది జాబితాలోని గణాంకాలకు స్వల్పంగా మార్పులు జరిగాయి. కాగా బిచ్కుందలో మాత్రం ఎలాంటి మార్పులేదు.
కామారెడ్డి బల్దియాలో...
కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డుల పరిధిలో 99,313 ఓట్లున్నాయి. అత్యధికంగా 25వ వార్డులో 2,535 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా రెండో వార్డులో 1,600 ఓట్లున్నాయి.
ఎల్లారెడ్డిలో...
ఎల్లారెడ్డి బల్దియాలో 12 వార్డులుండగా.. మొత్తం 13,265 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. అత్యధికంగా మూడో వార్డులో 1,165 ఓట్లు, అత్యల్పంగా ఎనిమిదో వార్డులో 1,003 ఓట్లు ఉన్నాయి. గతంలోకంటే 1,200 ఓట్లు ఎక్కువయ్యాయని అధికారులు తెలిపారు.
బిచ్కుందలో..
బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులున్నాయి. ఈ బల్దియాలో 12,759 మందికి ఓటు హక్కు ఉంది. అత్యధికంగా ఏడో వార్డులో 1,127 మంది ఓటర్లు, అత్యల్పంగా పదో వార్డులో 1,016 మంది ఓటర్లు ఉన్నారు.
బాన్సువాడ: మున్సిపల్ కార్యాలయంలో సో మవారం తుది ఓటర్ల జాబితాను కమిషనర్ శ్రీహరి రాజు విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలో 2020లో 20,543 ఓట్లు ఉండగా.. ప్ర స్తుతం 24,188 కి పెరిగాయని పేర్కొన్నారు. ఇక్కడ అత్యధికంగా ఆరో వార్డులో 1, 812 ఓట్లు, అత్యల్పంగా 19 వ వార్డులో 1,064 ఓటర్లు ఉన్నాయి. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు మల్లికార్జునరెడ్డి, దత్తురెడ్డి, వినయ్, నారాయణ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 1,49,525 మంది ఓటర్లు ఉండగా.. అందులో మహిళా ఓటర్లు 77,005 మంది, పురుష ఓటర్లు 72,489 మంది ఉన్నారు. నాలుగింటిలో కలిపి పురుషుల కంటే 4,516 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇతరులు 31 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. అత్యధికంగా జిల్లా కేంద్రమైన కామారెడ్డి బల్దియాలో 99,313 మంది ఓటర్లు ఉండగా, బిచ్కుందలో అత్యల్పంగా 12,759 మంది ఓటర్లున్నారు.
పట్టణం వార్డులు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
కామారెడ్డి 49 48,389 50,907 17 99,313
బాన్సువాడ 19 11,578 12,599 11 24,188
ఎల్లారెడ్డి 12 6,321 6,943 1 13,265
బిచ్కుంద 12 6,201 6,556 2 12,759
మొత్తం 92 72,489 77,005 31 1,49,525


