నేటినుంచి ‘అరైవ్ –అలైవ్’
● రోడ్డు ప్రమాదాల నివారణకు
ప్రత్యేక కార్యక్రమం
● నెలవారీ సమీక్షలో ఎస్పీ రాజేశ్ చంద్ర
కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ –అలైవ్ కార్యక్రమాన్ని చేపడుతోందని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్ల వారీగా కేసుల వివరాలు, చేపడుతున్న విచారణ, పెండింగ్ కేసులు తదితర విషయాలను తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మంగళవారం నుంచి ప్రారంభమయ్యే అరైవ్ –అలైవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
కేసుల పరిష్కారంలో జాప్యం వద్దు..
కేసుల పరిష్కారంలో జాప్యం చేయొద్దని, పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని ఎస్పీ సూచించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడిపందాలు, జూదం లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. చైనా మాంజా విక్రయాలపై దృష్టి పెట్టాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో బీట్ సిస్టమ్‌ను మరింత పటిష్టం చేయాలని, దొంగతనాలు జరగకుండా గస్తీ నిర్వహించాలని సూచించారు. డయల్ 100 కు ఫోన్ రాగానే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలవాలన్నారు. సమావేశంలో ఏఎస్పీలు నరసింహారెడ్డి, చైతన్యరెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్‌రావు, విఠల్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
నేటినుంచి ‘అరైవ్ –అలైవ్’


