దొంగ ఓట్లను తొలగించాలి
● బీజేపీ నేతల డిమాండ్
● కామారెడ్డి బల్దియా ముట్టడికి యత్నం
● అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్
కామారెడ్డి టౌన్: మున్సిపల్ ఓటర్ల జాబితాలో భారీగా దొంగ ఓట్లు చేర్చారని బీజేపీ నేతలు ఆరోపించారు. దొంగ ఓట్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కామారెడ్డి బల్దియా ముట్టడి చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు ముందస్తుగా కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని గేటును తోసుకుని ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కార్యాలయం ముఖద్వారం వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటతో మున్సిపల్ కార్యాలయం వద్ద గంట పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తోపులాటలో పోలీసులతో పాటు, బీజేపీ నాయకులు కింద పడిపోయారు. తోపులాటలో బీజేపీ నాయకులు సంతోష్‌రెడ్డి ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోగా ఆయనను పక్కన కూర్చోబెట్టి సపర్యలు చేశారు. ఆందోళన చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్‌తోపాలు దేవునిపల్లి, లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. బీజేపీ మహిళా నాయకులను సైతం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అధికారులు మున్సిపల్ ఓటర్ల జాబితాలో వేల సంఖ్యలో దొంగ ఓట్లను చేర్చారని మండిపడ్డారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దొంగ ఓట్లతో కాంగ్రెస్ గద్దెనెక్కాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దొంగ ఓట్లను తొలగించి పారదర్శకంగా జాబితా సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, నాయకులు విపుల్, సుజిత, బాలమణి, నాయకులు పాల్గొన్నారు.


