ఏకగ్రీవాలకు నై.. పోటీకి సై | - | Sakshi
Sakshi News home page

ఏకగ్రీవాలకు నై.. పోటీకి సై

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై ప్రభుత్వ లెక్కలు తప్పుతున్నాయి. ఏకగ్రీవాలకు సర్కారు నజరానాలు ప్రకటిస్తున్నా.. ఆశావహులు మాత్రం పల్లెపోరులో పోటీకి దిగేందుకే మక్కువ చూపుతున్నారు. ఏకగ్రీవానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. బరిలోకి దిగి సత్తా చూపితేనే పేరుప్రఖ్యాతులు వరిస్తాయని భావిస్తున్న సర్పంచ్‌ అభ్యర్థులు సంగ్రామానికే సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో పోటీకి దిగేందుకు పలువురు ఉత్సాహంగా నామినేషన్లు వేస్తున్నారు. సర్పంచ్‌ పదవిని ఎలాగైనా దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. కొన్నిచోట్ల కొంత మంది సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1.50 కోట్లు ఖర్చు పెట్టేందుకు సైతం వెనుకాడటం లేదంటే పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఏకగ్రీవాల జాడేదీ..?

పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి రెండు దశలకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తొలి దశ సంగ్రామానికి సంబంధించి కాకినాడ రూరల్‌, కరప, తాళ్లరేవు, పెద్దాపురం, సామర్లకోట మండలాల్లోని 93 సర్పంచ్‌, 1,064 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఇది మంగళవారం వరకూ కొనసాగనుంది. తొలి రోజునే సర్పంచ్‌ స్థానాలకు 83, వార్డు సభ్యులకు 314 నామినేషన్లు దాఖలయ్యాయంటేనే పోటీకి అభ్యర్థులు ఎంతగా ఉత్సాహం చూపుతున్నారో అర్థమవుతోంది. తొలి విడత షెడ్యూల్‌ ఇచ్చిన జిల్లాలోని ఆరు మండలాల్లో ఒక్క పంచాయతీ కూడా పూర్తి స్థాయిలో ఏకగ్రీవమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.

సర్కారు ఆఫర్‌కు నో..

ఏకగ్రీవాలతో పేరుతో అభ్యర్థులను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం వ్యూహం పన్నింది. సర్పంచ్‌తో పాటు మొత్తం వార్డులన్నీ ఏకగ్రీవమైన పంచాయతీలకు భారీ నజరానాలు ఇస్తామని ప్రకటించింది. గతంలో జనాభా ప్రాతిపదికన ఆయా పంచాయతీలకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ప్రభుత్వం ప్రోత్సాహకం ఇచ్చేది. దీనిని కూటమి ప్రభుత్వం భారీగా పెంచేసింది. ఐదు వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు రూ.25 లక్షలు, 10 వేలకు పైగా జనాభా కలిగిన పంచాయతీలకు రూ.50 లక్షల చొప్పున ప్రోత్సాహకాలు అందిస్తామని ఇటీవల ప్రకటించింది. ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది. అనంతరం, ప్రోత్సాహక మొత్తాన్ని ఆ పంచాయతీ పాలక వర్గం పదవీ కాలంలో విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ ప్రోత్సాహకాన్ని గ్రామ అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించాలి. అయితే, సర్కారు ఆఫర్‌ను సర్పంచ్‌, వార్డు అభ్యర్థులు ముక్తకంఠంతో తిరస్కరిస్తున్నారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వం మారితే ప్రోత్సాహకం వస్తుందన్న గ్యారెంటీ ఏముందన్ని ప్రశ్నిస్తూ, తాము పోటీకే దిగుతామని స్పష్టం చేస్తున్నారు. ఏకగ్రీవాలపై గ్రామ పంచాయతీలు, గ్రామీణ ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఆ తరహా కార్యక్రమం క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.

అనైతిక చర్యలకు తెర

ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు ఇవ్వడం ఎప్పటి నుంచో ఉంది. పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో వివాదాలు తలెత్తకుండా నివారించడం, ఎన్నికల ఖర్చు తగ్గించడంతో పాటు గ్రామాభివృద్ధిని ప్రోత్సహించడం దీని ప్రధాన ఉద్దేశం. అయితే, ఇది గ్రామస్తులందరి సమష్టి నిర్ణయంతో జరగాల్సిన ప్రజాస్వామ్య ప్రక్రియ. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం, ఆయా పార్టీల శ్రేణులు ఏకగ్రీవం ఉద్దేశాన్నే మార్చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్పంచ్‌ పదవిని అంగట్లో సరకులా వేలం వేసి మరీ ఏకగ్రీవానికి తెగబడుతున్నారు. ఏకగ్రీవం పేరుతో కూటమి మద్దతుదారులైన అభ్యర్థికి పట్టం కట్టేందుకు మార్గం సుగమం చేస్తున్నారు. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణాన్ని ఆనుకుని ఉన్న రెండు ప్రధాన పంచాయతీల్లో ఈ తరహా ప్రతిపాదనలు వచ్చాయి. పేరూరు పంచాయతీ సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవంగా తమకు అప్పగిస్తే రూ.50 లక్షలు ఇస్తామంటూ ఓ ఆశావహుడు భారీ ఆఫర్‌ ఇచ్చాడు. బండారులంకలో ఏకంగా రూ.కోటి ఇస్తామంటూ మరో వ్యక్తి ముందుకొచ్చినట్లు సమాచారం. ఈ ఇద్దరూ అధికార టీడీపీ సానుభూతిపరులే కావడం గమనార్హం. అలాగే, కాకినాడ జిల్లా చేబ్రోలులో రూ.50 లక్షల వరకూ ఇచ్చేందుకు టీడీపీ సానుభూతిపరుడు ఒకరు సిద్ధమయ్యారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో జనసేన సానుభూతిపరుడు రూ.1.80 కోట్లు ఆఫర్‌ చేశాడు. యు.కొత్తపల్లిలో జనసేన సానుభూతిపరులు రూ.25 లక్షలు ఆఫర్‌ చేశారు. అయితే, ఈ మూడు గ్రామాల్లోనూ వారి ప్రలోభాలకు ఆయా గ్రామస్తులు లొంగలేదు. దీంతో, డబ్బులు ఎర వేసి, ఏకగ్రీవం చేసుకోవాలనుకున్న కూటమి నేతల కుయుక్తులు ఫలించలేదు.

పంచాయతీ ఎన్నికల్లో

ఏకగ్రీవాలపై ప్రభుత్వం దృష్టి

భారీగా ప్రోత్సాహకాలు

ఇస్తామంటూ ప్రకటన

సర్కారు ఆఫర్‌ను

లెక్క చేయని అభ్యర్థులు

బరిలోకి దిగేందుకే

అత్యధిక శాతం మంది మొగ్గు

భారీగా నామినేషన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement