రబీ వరి సాగు లక్ష్యం 71 వేల హెక్టార్లు | - | Sakshi
Sakshi News home page

రబీ వరి సాగు లక్ష్యం 71 వేల హెక్టార్లు

Nov 17 2026 12:20 AM | Updated on Nov 17 2026 12:20 AM

● డిసెంబర్‌ 1 నుంచి నీటి విడుదల

● కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రబీ సీజన్‌లో జిల్లావ్యాప్తంగా 71 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరి సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. రబీ సాగు, నీటి విడుదల తదితర అంశాలపై జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కలెక్టరేట్‌లో సోమవా రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరించారు. రబీ సాగుకు డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి గోదావరి తూర్పు డెల్టా, పిఠాపురం బ్రాంచి కెనాల్‌ (పీవీసీ), ఏలేరు ప్రాజెక్టుల ద్వారా నీరు విడుదల చేస్తామని చెప్పారు. గోదావరి తూర్పు డెల్టాలో నీటి లభ్యత సుమారు 15 శాతం తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ, నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించి (రేషనలైజేషన్‌), వంతుల వారీ విధానం, డ్రైనేజీలకు క్రాస్‌ బండ్లు వేస్తూ ఇంజిన్ల సాయంతో సాగునీరు అందిస్తామని చెప్పారు. రబీ సాగుకు జిల్లాలో సుమారు 78 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అంచనా వేశామన్నారు. మొత్తం 36,738 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం కాగా, ప్రస్తుతం 14,288 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉందని తెలిపారు. సుమారు 35 వేల మెట్రిక్‌ టన్నుల వరి విత్తనాలు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే రైతుల వద్ద సుమారు 25 వేల మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అదనంగా 10 వేల మెట్రిక్‌ టన్నుల విత్తనాలకు ఆర్డర్లు ఇచ్చామన్నారు. రైతులు సరైన నీటి యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అందుబాటులో ఉన్న సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. డిసెంబర్‌ 31వ తేదలోగా నాట్లు పూర్తి చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. విలేకర్ల సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ప్రియ, జల వనరుల శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్‌ కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement