అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుడిని కార్తిక మాసం తొలి సోమవారం సుమారు 50 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్న విషయం తెలిసిందే. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ భక్తుల రాక కొనసాగింది. సత్యదేవుని ఉచిత దర్శనానికి రెండు గంటలు, అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆరు వేల వ్రతాలు జరగగా, అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది.
మార్చురీలో జింబాబ్వే
విద్యార్థి మృతదేహం
కాకినాడ రూరల్: సూర్యారావుపేట బీచ్‌లో సముద్ర స్నానానికి దిగి, ప్రమాదవశాత్తూ మృతి చెందిన జింబాబ్వేకు చెందిన విద్యార్థి ఫనేలే గుడ్‌విల్ ఎన్‌క్యూబ్ (22) మృతదేహాన్ని కాకినాడ జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. రెండు దేశాలకు సంబంధించి విషయం కావడంతో పోలీసులు ఇండియన్ ఎంబసీ నుంచి జింబాబ్వే ఎంబసీ ద్వారా ఆ దేశంలోని మృతుడి రక్త సంబంధీకులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు ఆథరైజేషన్ లెటర్ రావాల్సి ఉంది. మృతదేహాన్ని జింబాబ్వే తరలించేందుకు అనుమతులు వచ్చిన తరువాత జీజీహెచ్ వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన రికార్డింగ్‌ల సీడీని జింబాబ్వే పంపించాల్సి ఉంటుందని తిమ్మాపురం పోలీసులు తెలిపారు.
విజిలెన్స్ అధికారుల
ఆకస్మిక తనిఖీలు
● ముందస్తు సమాచారంతో షాపులు మూసివేసిన వ్యాపారులు
● ఐదు షాపులపై 13 కేసుల నమోదు
తుని: విజిలెన్స్ అధికారులు సోమవారం తుని పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. పట్టణంలో బియ్యం, కిరాణా సామగ్రిని ఎంఆర్పీకి మించి విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ, తూనికలు – కొలతలు, ఫుడ్ అండ్ సేఫ్టీ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక దాడులపై ముందే సమాచారం అందడంతో పలువురు వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి అధికారులకు ఝలక్ ఇచ్చారు. అక్కడక్కడ తెరచి ఉన్న ఐదు కిరాణా షాపుల్లో అధికారులు తనిఖీలు చేసి, 13 కేసులు నమోదు చేశారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు బియ్యం, కిరాణా సామగ్రి విక్రయిస్తున్నట్లు అధికారుల పాథమిక విచారణలో వెల్లడైంది. ఈ విషయమై వివరణ కోరగా తనిఖీల వివరాలను గోప్యంగా ఉంచాలన్న ఆదేశాలతో ఎవ్వరికీ వెల్లడించలేమని ఓ అధికారి చెప్పారు.


