గండేపల్లి (జగ్గంపేట): జగ్గంపేట బాలాజీ నగర్లో ఆదివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. సుమారు 1.10 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆయిల్ టిన్నులను మోసుకుంటూ వెళ్లడాన్ని స్థానికు లు గుర్తించారు. ఫోన్ల ద్వారా ఒకరికొకరు సమాచారం అందజేసుకుని కాలనీని జల్లెడ పట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులతో కలిసి ఆ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ అలికిడితో దొంగలు అక్కడి నుంచి ఉడాయించారు. రాత్రి 11 గంటలకంటే ముందుగానే ఆ దొంగలు బాలాజీ నగర్ చేరుకున్నట్లు అక్కడి సీసీ ఫుటేజీలో నమోదైంది. స్థానికంగా ఉన్న ఐషర్ వ్యాన్ల నుంచి ఆరు టిన్నుల్లోకి వారు డీజిల్ పోశారు. ఆ టిన్నులను భుజాలపై మోసుకుంటూ బాలాజీ టైల్స్ ఫ్యాక్టరీ మధ్యలోని ప్రహరీకి అవతలివైపు చీకట్లో దాచినట్లు స్థానికులు గుర్తించారు. అక్కడ రెండు టిన్నులు, ఒక సంచిలో రెంచిలు, స్క్రూడ్రైవర్, వాటర్ ప్యాకెట్లు లభించాయి. దొంగలిద్దరూ నలుపురంగు దుస్తులు, ముఖాలకు మాస్క్లు ధరించి ఉన్నారని, సుమారు 25 ఏళ్ల లోపు వయస్సు ఉండవచ్చుని అంటున్నారు. గతంలో కూడా డీజిల్ దొంగిలించిన వారు వీరేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఇళ్లలో జరుగుతున్న వరుస చోరీలకు, వీరికి ఏమైనా సంబంధం ఉందా లేక వారు, వీరే వేర్వేరా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.


