కొబ్బరిని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

కొబ్బరిని కాపాడుకుందాం

Nov 14 2026 12:53 AM | Updated on Nov 14 2026 12:53 AM

ఫ దెబ్బతిన్న తోటలకు చికిత్స చేయాలి

ఫ కొన్ని జాగ్రత్తలతో నష్ట నివారణ

ఫ ఉద్యాన శాఖ జిల్లా అధికారి రమణ

ఐ.పోలవరం: అర్నబ్‌ తుపాను కోనసీమ జిల్లాలోని ఉద్యాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలుల ధాటికి కొబ్బరి చెట్ల మొవ్వలు మెలి తిరగడంతో పాటు మట్టలు విరిగి వేలాడుతున్నాయి. పలుచోట్ల చెట్లు వంగిపోగా, మరికొన్ని చోట్ల పూత, పిందెలు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి తదితర తోటలకూ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో దెబ్బతిన్న తోటలను రైతులు కాపాడుకోవాలని, అందుకోసం కొన్ని చర్యలు తీసుకోవాలని ఉద్యాన శాఖ జిల్లా అధికారి బీవీ రమణ తెలిపారు.. ఆ వివరాల ప్రకారం..

● తుపానుకు దెబ్బతిన్న తోటల్లో సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టకపోతే కొబ్బరి చెట్లకు మొగ్గకుళ్లు, కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగు ముప్పు పొంచి ఉంది. మెలి తిరిగిన మొవ్వ నుంచి కొత్త ఆకు సాధారణంగా విచ్చుకోవడానికి రెండు, మూడు నెలల సమయం పడుతుంది. ఈ లోపు మొవ్వను కాపాడుకోవడంతో పాటు చెట్లకు అవసరమైన పోషకాలు అందించడం కీలకం.

● ముందుగా తోటల్లో నిలిచిన ముంపు నీటిని మురుగు కాలువల ద్వారా బయటకు పంపించాలి. నేలలో తేమ తగ్గిన తర్వాతే అంతర సేద్యం, ఎరువుల వినియోగం చేపట్టాలి.

● చెట్లలో పూర్తిగా విరిగిపోయిన మట్టలు, ఎండిపోయిన ఆకులు, కుళ్లిపోతున్న భాగాలు, పాడైన పూత, పిందెలను పదునైన కత్తితో జాగ్రత్తగా తొలగించాలి. పచ్చిగా ఉన్న లేత ఆకులను బలవంతంగా తీసివేయకూడదు.

● చెట్టు కాండం పైభాగంలో, ఆకుల సందుల్లో పేరుకుపోయిన ఎండు పీచు, చెత్తను తొలగించి గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. మొవ్వ భాగంలో ఏర్పడిన గాయాల ద్వారా మొగ్గకుళ్లు తెగులు సోకే ప్రమాదం ఉన్నందున ఒక శాతం బోర్డో మిశ్రమం లేదా లీటరు నీటికి 3 గ్రాముల కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ కలిపి మొవ్వ, ఆకుల మొదళ్లు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. మొవ్వలో పగుళ్లు, గాయా లు ఉంటే 10 శాతం బోర్డో పేస్ట్‌ పూయాలి. ముందస్తు రక్షణగా పొటాషియం ఫాస్ఫోనేట్‌ వినియోగించవచ్చు.

● గాయపడిన మొవ్వ నుంచి వచ్చే వాసనకు కొమ్ము పురుగు, ఎర్రముక్కు పురుగులు వస్తాయి. వాటి నివారణకు వేపపిండి, ఇసుకను సమాన భాగాలుగా కలిపి మొవ్వలోని లేత ఆకుల కణుపుల సందుల్లో వేయాలి. అవసరాన్ని బట్టి క్లోరం ట్రానిలిప్రోల్‌ 0.4 శాతం మందును సిఫార్సు చేసిన మోతాదులో వినియోగించాలి. తోటలో ఎకరానికి ఒకటి లేదా రెండు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేయడం ద్వారా పురుగుల ఉధృతిని అరికట్టవచ్చు.

● తుపాను గాలులకు చెట్లు వంగినా, వేర్లు పైకి లేచినా మొదళ్ల చుట్టూ సారవంతమైన మట్టిని ఎగదోసి గట్టిగా తొక్కాలి. తుపాను తగ్గిన 15–20 రోజుల తర్వాత వేర్ల వ్యవస్థ కుదుటపడిన అనంతరం ఒక్కో కొబ్బరి చెట్టుకు 500 గ్రాముల యూరియా, కిలో సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, కిలో మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌, 500 గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్‌, 50 గ్రాముల బోరాక్స్‌ అందించాలి.

● 25–30 కిలోల పశువుల ఎరువు లేదా ఐదు కిలోల వేపపిండిని చెట్టు మొదలుకు 1.5–2 మీటర్ల దూరంలో పాదు తీసి వేయాలి. లేత మొవ్వ సక్రమంగా విచ్చుకోవడానికి బోరాక్స్‌ తోడ్పడుతుంది.

అరటి తోటలో గెలలు వేసే దశలో ఉన్న మొక్కలకు ఒక్కోదానికి 100 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ చొప్పున 20–25 రోజుల వ్యవధిలో రెండు, మూడు విడతలుగా అందించాలి. పొటాషియం నైట్రేట్‌ ద్రావణాన్ని ఆకులు తడిచేలా పిచికారీ చేయాలి. సిగటోకా ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రోపికొనజోల్‌ వినియోగించాలి. దుంపకుళ్లు సోకిన మొక్కలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. గెలలు వచ్చిన చెట్లకు వెదురు కరల్రతో ఊతమివ్వాలి.

బొప్పాయి తోటల్లో నీరు నిల్వకుండా చూడాలి. కాండం కుళ్లు, ఇతర తెగుళ్ల లక్షణాలు కనిపిస్తే ఉద్యాన శాఖ నిపుణుల సూచనల మేరకు నివారణ మందులు వాడాలి. పండు ఈగ ఉధృతిని అరికట్టేందుకు ఎకరాకు 10–15 మిథైల్‌ యూజినాల్‌ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి.

కూరగాయలు, తమలపాకులు, పసుపు పంటలో ముంపు నీటిని బయటకు పంపించి ఆకుమచ్చ, దుంపకుళ్లు తెగుళ్ల నివారణకు సిఫార్సు చేసిన మందులు వినియోగించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement