సామర్లకోట 110.2
కాకినాడ రూరల్ 88.2
జగ్గంపేట 84.4
పెద్దాపురం 71.4
గండేపల్లి 68.4
ఏలేశ్వరం 67.2
పెదపూడి 62.4
కరప 56.8
ప్రత్తిపాడు 52.8
యు.కొత్తపల్లి 49.8
కాజులూరు 48.8
కాకినాడ అర్బన్ 44.2
తాళ్లరేవు 42.8
కిర్లంపూడి 24.8
పిఠాపురం 21.6
శంఖవరం 12.6
గొల్లప్రోలు 11.4
రౌతులపూడి 5.6
తుని 4.6
తొండంగి 3.2
కోటనందూరు 1.6
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): సరిగ్గా గత మంగళవారం అర్నబ్ భీకర తుపాను పొరుగున కోనసీమ జిల్లాపై విరుచుకుపడింది. దీని ప్రభావం కాకినాడ జిల్లాపై కూడా తీవ్రంగా పడింది. భారీగా పంట నష్టం వాటిల్లింది. మళ్లీ వారం రోజుల తర్వాత ఈ మంగళవారం మురసు తీవ్ర తుపాను ఇక్కడకు వందల కిలోమీటర్ల దూరాన ఉన్న ఒంగోలు సమీపాన తీరం దాటింది. కానీ, ఇది జిల్లాపై తీవ్రంగానే ప్రభావం చూపింది. ఈ తుపాను ప్రభావంతో జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షంతో జనజీవనం అతలాకుతలమైంది. జోరు వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై కాలువల్లా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సాధారణ రోజుల్లో రద్దీగా ఉండే రహదారులు సైతం వర్షం కారణంగా నిర్మానుష్యంగా మారాయి.
● కాకినాడతో పాటు జిల్లాలోని పెద్దాపురం, సామర్లకోట, తుని, పిఠాపురం మున్సిపాలిటీల పరిధిలో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వాన నీటితో కలసిన మురుగు నీరు రహదారులపై నిలిచిపోయింది. ఆ నీటిలో ప్రయాణించేందుకు వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
● కాకినాడ నగరంలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. ఉదయం పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని పలు ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు మందగించాయి. కొన్ని ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకూ నీరు చేరడంతో అక్కడి రహదారులపై నడవడానికి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం తగ్గిన తరువాత కూడా ముంపు నీరు రోడ్డు పైనే నిలిచిపోవడంతో రాత్రి వరకూ పడరాని పాట్లు పడ్డారు. ద్విచక్ర వాహనదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వర్షపు నీటిలో వాహనాలు మొరాయించడంతో కొందరు వాటిని తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. నీటితో నిండిన రహదారులపై గుంతలు కనిపించక పలువురు వాహనచోదకులు గాయాల పాలయ్యారు. రోజంతా వర్షం కురుస్తూండటంతో అత్యవసర పనులున్నవారు మాత్రమే బయటకు వచ్చారు. వ్యాపార సంస్థలు, దుకాణాల వద్ద కూడా రద్దీ తగ్గింది. వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతుందేమోనని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. వర్షపు నీరు త్వరగా బయటకు వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీలను శుభ్రం చేసి, ముంపు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
● సామర్లకోట ఆర్టీసీ కాంప్లెక్స్ చెరువులా మారడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు నీటిలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. వర్షం కారణంగా బస్సుల రాకపోకలు కూడా ఆలస్యమయ్యాయి. మరోవైపు పట్టణంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
● మురసు తుపాను ప్రభావంతో తొండంగి మండలం అద్దరిపేట, ఎర్రయ్యపేట, దానవాయిపేట తదితర గ్రామాల్లోని తీరంలో సముద్ర అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
మండలాల వారీగా వర్షపాతం వివరాలు
జిల్లావ్యాప్తంగా మంగళవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నమోదైన వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో..
గత వారం అర్నబ్
వారం రోజుల్లోనే రెండో తుపాను
ఉదయం నుంచి
సాయంత్రం వరకూ కుండపోత
జలమయమైన రహదారులు
జనజీవనం అతలాకుతలం


