పరిషత్‌ ప్రచారానికి తెర | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ ప్రచారానికి తెర

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

● రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

● జిల్లాలోని 395 ఎంపీటీసీలకు

933 మంది పోటీ

● 20 జెడ్పీటీసీలకు బరిలో

80 మంది అభ్యర్థులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ‘పరిషత్‌’ ఎన్నికల ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీల బరిలో ఉన్న అభ్యర్థులు వారం రోజులుగా పల్లెల్లో ప్రచారాన్ని జోరుగా హుషారుగా హోరెత్తించారు. చివరి రోజైన మంగళవారం పలు ప్రాంతాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం చేశారు. తుపాను ప్రభావంతో జోరుగా వర్షాలు కురిసినప్పటికీ.. పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించి, ఓటర్లను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ నెల 5న జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ‘ఫ్యాన్‌’ గుర్తుకు ఓట్లు వేసి తమను గెలిపించాలని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ఓటర్లను కోరారు. తద్వారా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గుణపాఠం చెప్పాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 401 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, వీటిలో ఆరు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 395 స్థానాలకు 933 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే, 20 జెడ్పీటీసీ స్థానాలకు 80 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 7న నిర్వహించనున్నారు. ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో 11,68,848 ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 5,80,945 మంది, మహిళలు 5,87,856 మంది, ఇతరులు 47 మంది ఉన్నారు.

ప్రలోభాలకు తెర లేపిన కూటమి

జిల్లాలో వారం రోజులుగా హోరెత్తిన పరిషత్‌ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక ఓటర్ల తీర్పు కోసం అభ్యర్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. పోలింగ్‌కు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో అధికార కూటమి పార్టీలు ప్రలోభాలకు తెర లేపుతున్నాయి. ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఆ పార్టీల నేతలు డబ్బులు, మద్యం, చీరల పంపిణీ మొదలుపెట్టారు. తమకు అనుకూలంగా లేని ఓటర్లను సైతం మచ్చిక చేసుకునే పనిలో పలువురు కూటమి అభ్యర్థులు నిమగ్నమయ్యారు. తమకు ఓటు వేస్తే కోరిన సహాయం చేస్తామంటూ ప్రలోభపెడుతున్నారు. మరోవైపు దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు గాలం వేస్తూ, ఫోన్ల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పోలింగ్‌ రోజున స్వగ్రామాలకు వచ్చి ఓటు వేయాలని కోరుతున్నారు. వారిని రప్పించేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేయడంతో పాటు, కొందరికి ఫోన్‌పే ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. పోలింగ్‌కు సమయం తక్కువగా ఉండటంతో తమకు అనుకూలంగా ఉన్న ఓటర్లను గుర్తించి, వారితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాలు, ప్రలోభాలపై ఎన్నికల అధికారులు అప్రమత్తం కావాల్సి ఉంది. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement