మున్సిపాలిటీల్లో కూటమి గెలుపు | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల్లో కూటమి గెలుపు

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార కూటమి విజయం సాధించింది. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించగా.. 4 చోట్ల జనసేన, 2 చోట్ల టీడీపీ నుంచి చైర్మన్‌ అభ్యర్థులు గెలిచారు. ఆరు మున్సిపాలిటీల్లో మొత్తం 191 వార్డులు ఉండగా 3 జనసేన, ఒకటి టీడీపీకి ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 187 వార్డులకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక వార్డులను కూటమి దక్కించుకుంది. ఆయా మున్సిపాలిటీల్లో మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం ఎనిమిది గంటలకు స్ట్రాంగ్‌ రూములకు సీలు తొలగించారు. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించారు. అనంతరం వార్డు కౌన్సిలర్‌ ఓట్లు, తర్వాత చైర్మన్‌ ఓట్లు లెక్కించారు. గెలుపొందిన వారికి ఎన్నికల అధికారులు ఎన్నికై నట్లు ధ్రువీకరణ పత్రాలు (డిక్లరేషన్‌ ఫారం) అందజేశారు.

● డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మున్సిపాలిటీల్లో ఆసక్తికర పరిణామం ఏర్పడింది. ఫలితాల సరళి అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఈ మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 15, 23, 27 జనసేనకు ఏకగ్రీవం అయ్యాయి. ప్రకటించిన ఫలితాల్లో 16 వార్డులను జనసేన, 5 టీడీపీ, ఒకటి బీజేపీ, ఒకటి వైఎస్సార్‌ సీపీ కై వసం చేసుకున్నాయి. ఇక్కడ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తన సత్తా చూపించారు. దీంతో, ఏకంగా 10 వార్డుల్లో కూటమి రెబల్‌ అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో టీడీపీ, జనసేన నుంచి చెరో నలుగురు, ఇతరులు ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది. రెబల్‌ అభ్యర్థుల్లో వర్మ అనుచరులున్నట్లు ప్రచారం నడుస్తోంది.

● పిఠాపురం మున్సిపల్‌ చైర్మన్‌ స్థానానికి జరిగిన పోటీలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పెదపాటి రాజేష్‌ కుమార్‌పై జనసేన అభ్యర్థి దానం లాజర్‌ బాబు 9,235 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పెదపాటికి 10,817, లాజర్‌బాబుకు 20,052 ఓట్లు వచ్చాయి.

● గొల్లప్రోలు మున్సిపాలిటీలో వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి చక్కపల్లి నాగేశ్వరావుపై జనసేన చైర్మన్‌ అభ్యర్థి కడారి తమ్మయ్య నాయుడు 8,437 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చక్కపల్లికి 3,320 ఓట్లు రాగా.. కడారికి 11,757 ఓట్లు వచ్చాయి. ఈ మున్సిపాలిటీలో 23 వార్డులుండగా జనసేన 13, టీడీపీ 6, స్వతంత్ర అభ్యర్థులు నాలుగుచోట్ల గెలిచారు.

● తుని మున్సిపాలిటీలో కూటమి అభ్యర్థులకు వైఎస్సార్‌ సీపీ గట్టి పోటీ ఇచ్చింది. ఇక్కడ 36 వార్డులుండగా 10 చోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. టీడీపీ 18, జనసేన 5, బీజేపీ 1, స్వతంత్రులు 2 వార్డులు దక్కించుకున్నారు. వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి పిట్ల రామతులసిపై జనసేన అభ్యర్థి శరకణం శ్రీలత 4,100 ఓట్ల ఆధిక్యం సాధించారు.

● సామర్లకోట మున్సిపాలిటీలో 5 వార్డులను వైఎస్సార్‌ సీసీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ 36 వార్డులుండగా టీడీపీ 20, జనసేన 11 దక్కించుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి ఉబా జాన్‌మోజెస్‌కు 9,021, జనసేన చైర్మన్‌ అభ్యర్థి పిట్టా జానకి రామారావుకు 19,995 ఓట్లు వచ్చాయి. దీంతో, పిట్టా 10,770 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

● పెద్దాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు ఎన్నికలు జరగగా టీడీపీ 18, జనసేన 11, బీజేపీ 1, వైఎస్సార్‌ సీపీ 2 చొప్పున దక్కించుకున్నాయి. వైఎస్సార్‌ సీపీ చైర్మన్‌ అభ్యర్థి కాపుగంటి సౌందర్యలక్ష్మిపై టీడీపీ చైర్మన్‌ అభ్యర్థి రాజా సూరిబాబురాజు 13,941 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

● ఏలేశ్వరం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌ పీఠాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బదిరెడ్డి ఆశాలతపై టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ అక్షిత 254 ఓట్ల మెజారిటీతో గెలిచారు. చైర్‌పర్సన్‌ ఎన్నికల్లో మొత్తం 18,374 ఓట్లు పోలయ్యాయి. వీటిలో వైఎస్సార్‌ సీపీకి 8,730, టీడీపీ 8,984, కాంగ్రెస్‌ 53, ఇండిపెండెంట్‌ 51, నోటా 109, ఇన్‌వాలిడ్‌ 447 ఓట్లు వచ్చాయి. టీడీపీకి వచ్చిన మెజార్టీ కంటే ఇన్‌వాలిడ్‌ ఓట్లు ఎక్కువ రావడం విశేషం.

ఆరు చైర్మన్‌ స్థానాలు కై వసం

అత్యధిక వార్డుల్లో విజయం

ఏలేశ్వరం, తునిలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్ల విజయం

పిఠాపురంలో 10 స్థానాల్లో

సత్తా చాటిన రెబల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement