కోరుకొండ: మధురపూడిలోని రాజమండ్రి విమానాశ్రయానికి బుధవారం రావాల్సిన బెంగళూర్, చైన్నె విమానాలు రద్దయ్యాయి. ఇండిగో సంస్థకు చెందిన 9 సర్వీసుల రాకపోకలు జరగాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించలేదు. దీంతో, హైదరాబాద్, ముంబై నుంచి 4 సర్వీసులు మాత్రమే నడిచాయి.
ప్రజా కోర్టులో ధర్మమే గెలిచింది
అమలాపురం టౌన్: కూటమి నాయకులు కుట్ర చేసినా ప్రజా కోర్టులో ధర్మమే గెలిచిందని, తన భార్య శ్యామలాదేవిని 15వ వార్డులో ఓటర్లు గెలిపించారని వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు సంసాని వెంకట చంద్రశేఖర్ (బులినాని) అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మున్సిపాలిటీలోని 15వ వార్డులో తాను, తన భార్య (డమ్మీ) కౌన్సిలర్ అభ్యర్థులుగా వైఎస్సార్ సీపీ తరఫున నామినేషన్లు వేశామన్నారు. కూటమి నాయకులు కుట్ర పన్ని పరిశీలనలో తన నామినేషన్‌ను తిరస్కరించేలా చేశారన్నారు. వారు చేస్తున్న అవినీతిని ప్రశ్నించడంతో తనపై కక్షతో ఈ దుశ్చర్యకు ఒడిగట్టారని అన్నారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, అక్కడ న్యాయం గెలిచే అవకాశం ఉన్నా ఈలోగా ప్రజా కోర్టులో మాత్రం ధర్మమే గెలిచేలా తమ వార్డు ఓటర్లు తీర్పు ఇచ్చారని చెప్పారు. వార్డు ప్రజలకు తాను, తన భార్య ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని బులినాని హామీ ఇచ్చారు.


