కన్నీరే మిగిలింది | - | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలింది

Nov 4 2026 1:32 AM | Updated on Nov 4 2026 1:32 AM

● అన్నదాతల గుండెల్లో వరుస తుపాన్లు ● చివరి ఆశలపై నీళ్లు

● ఇప్పటికే 55 వేల హెక్టార్లలో వరికి అర్నబ్‌ ఉరి ● మళ్లీ ముంచేసిన మురసు

● నీట మునిగి, నేలనంటేసిన వరి చేలు ● కుదేలైన రైతులు ● గింజ కూడా మిగలదని ఆవేదన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): వరుస తుపాన్లు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. నేలపై ఉన్న కోడి పిల్లను ఆకాశంలో ఎగురుతున్న గెద్ద రివ్వున వచ్చి ఎత్తుకుపోయినట్టు.. చేతికందుతుందనుకున్న పంటను ఒకదాని వెనుక ఒకటిగా వచ్చిన తుపాన్లు ముంచెత్తుతూంటే.. చేలు చెరువుల్లా మారుతూంటే.. పంట నేలనంటేసి, నీట నానుతూంటే.. ఏం చేయాలో తెలియక రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. ఏదో కక్ష కట్టినట్టుగా.. గత వారం అర్నబ్‌ తుపాను.. మళ్లీ ఇప్పుడు మురసు తుపాను సృష్టించిన విలయానికి.. ఆరుగాలం పడిన కష్టం కష్టం కరిగిపోతూంటే దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. కుటుంబమంతా రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి, కన్న బిడ్డలా సాకిన పంట.. కళ్లెదుటే కుళ్లిపోతూంటే.. ఒక్క గింజ కూడా దక్కే అవకాశం లేదంటూ వేదనాసాగరంలో మునిగిపోతున్నారు.

గత నెల మొదటి వారంలో కురిసిన భారీ వర్షాలతో జిల్లాలోని ఖరీఫ్‌ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఆ వర్షాలకు కొంత వరకూ పంట నష్టం జరిగినా రైతులు తట్టుకుని, నిలబడగలిగారు. అనంతరం, గత వారం వచ్చిన అర్నబ్‌ తుపానుతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ఈ తుపాను ధాటికి జిల్లావ్యాప్తంగా 55 వేల హెక్టార్లలో వరి పంట దెబ్బ తిందన్నది అధికారుల ప్రాథమిక అంచనా. మళ్లీ ఇప్పుడు మురసు తుపాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో వరి పంట మరింతగా దెబ్బ తింది. గత తుపానుకు దెబ్బ తినగా ఎక్కడైనా పంట మిగిలి ఉంటే.. దానిని కాస్తా ఈ తుపాను పూర్తిగాా ఊడ్చేసిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. తాజా వర్షాలకు కరప, సామర్లకోట, పెద్దాపురం, ప్రత్తిపాడు తదితర అనేక ప్రాంతాల్లో వరి పంటకు మరింత నష్టం వాటిల్లింది. వరితో పాటు ఇతర ఆహార, వాణిజ్య, ఉద్యాన పంటలకు సైతం నష్టం వాటిల్లడంతో జిల్లా రైతులు మరింత కుదేలయ్యారు.

మారుతున్న వాతావరణం.. రైతుకు శాపం

వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు రైతులకు శాపంగా మారాయి. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో, ఎప్పుడు ఎండలు తీవ్రతరమవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షపాతం, ఉష్ణోగ్రతల మార్పులు పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీంతో, రైతులు సాగు ప్రణాళికలను ముందుగానే రూపొందించుకుని, పక్కాగా అమలు చేయలేకపోతున్నారు. ఖరీఫ్‌ వరి పంట కోతకు వచ్చే సమయంలో తుపాన్లు విరుచుకుపడుతూండటంతో వారి ఆశలు ఆవిరవుతున్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడం, పంట నేలకొరగడం, ధాన్యం నానిపోవడం వంటి సమస్యలతో అన్నదాతలు సతమతమవుతున్నారు. దీనికి తోడు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు రోజురోజుకూ పెరుగుతూండటం వారికి భారంగా మారుతున్నాయి. అలాగే, పెట్టుబడి సాయం సకాలంలో అందించకపోవడంతో చాలా మంది రైతులు సాగుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఇంత హైరానా పడి సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. ఒకవైపు అప్పులపై వడ్డీలు పెరుగుతూండగా, మరోవైపు కుటుంబ పోషణ, పిల్లల చదువులు, వ్యవసాయ ఖర్చులు భారంగా మారుతూండటంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో పులి మీద పుట్రలా ప్రకృతి కూడా వారి వెన్ను విరుస్తోంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి

వరుస తుపాన్లతో నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. వ్యవసాయ, ఉద్యాన అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి, పంట నష్టాలను సమగ్రంగా అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతి రైతునూ పరిహారం జాబితాలో చేర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌ నెలాఖరులో సంభవించిన మొంథా తుపాను నష్టపరిహారం కూడా వెంటనే విడుదల చేయాలని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో తమకు అండగా నిలిచి, తక్షణ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement