ఫలితం మిగిలింది | - | Sakshi
Sakshi News home page

ఫలితం మిగిలింది

Nov 2 2026 12:23 AM | Updated on Nov 2 2026 12:23 AM

తుని రూరల్‌: తుని ఉప్పరగూడెంలో బారులు తీరిన ఓటర్లు

గొల్లప్రోలులో ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టిన ఓటర్లు

సమరం

ముగిసింది..

తుని రూరల్‌: తుని 30వ వార్డులో పోలింగ్‌

అనంతరం బ్యాలెట్‌ బాక్సుకు సీల్‌ వేస్తున్న సిబ్బంది

ఏలేశ్వరం: క్యూలో నిలబడిన ఓటర్లు

పిఠాపురం: జగ్గయ్య చెరువు కాలనీ పోలింగ్‌ బూత్‌ వద్ద బారులు తీరిన ఓటర్లు

జిల్లాలో పోలింగ్‌ ఇలా..

మున్సిపాలిటీ మొత్తం పోలైన పోలింగ్‌

ఓటర్లు ఓట్లు శాతం

గొల్లప్రోలు 20,846 16,024 76.87

పెద్దాపురం 41,528 28,032 67.50

పిఠాపురం 43,307 32,666 75.43

సామర్లకోట 43,865 30,990 70.65

తుని 43,036 28,334 65.84

ఏలేశ్వరం 25,472 18,354 72.06

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మున్సిపల్‌ సంగ్రామంలో కీలక ఘట్టమైన పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. ఒకటి, రెండుచోట్ల చెదురుమదురు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో సాఫీగా సాగింది. జిల్లావ్యాప్తంగా 6 మున్సిపాలిటీల్లో చైర్మన్‌, 187 వార్డు కౌన్సిలర్‌ స్థానాలకు ఈ ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకూ జరిగింది. అప్పటి వరకూ క్యూలో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఓటు వేసేందుకు ఉదయం 7 గంటల నుంచే ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పలుచోట్ల వృద్ధులు, దివ్యాంగులు ఓటు వేసేందుకు తరలి వచ్చారు. మంచంపై నుంచి లేవలేని వారు సైతం ఇతరుల సహాయంతో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలింతలు, గర్భిణులు క్యూలో వేచి ఉండి మరీ ఓటు వేశారు.

ఓటు వేసిన 1,54,400 మంది

జిల్లాలోని 6 మున్సిలిటీల్లో మొత్తం 2,18,054 మంది ఓటర్లుండగా.. వీరిలో పురుషులు 1,04,756, మహిళలు 1,13,269, ఇతరులు 29 మంది ఉన్నారు. వీరిలో 1,54,400 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 73,940 మంది పురుషులు, 80,443 మంది మహిళలు, 17 మంది ఇతరులు ఉన్నారు. పోలింగ్‌ ముగిసే సమయానికి మొత్తం 6 మున్సిపాలిటీల్లో 70.81 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉదయం 9 గంటలకు 14.99 శాతం, 11 గంటలకు 32.10 శాతం, మధ్యాహ్నం ఒంటి గంటకు 47.66 శాతం, 3 గంటలకు 59.35 శాతం, పోలింగ్‌ ముగిసే సమయానికి 70.81 శాతం చొప్పున ఓటింగ్‌ నమోదైంది. అత్యధికంగా గొల్లప్రోలులో 75.43 శాతం, అత్యల్పంగా తుని పురపాలక సంఘంలో 65.84 శాతం మంది ఓట్లు వేశారు. పిఠాపురంలో 75.43, పెద్దాపురం 67.50, సామర్లకోట 70.65, తుని 65.84, ఏలేశ్వరం మున్సిపాలిటీలో 72.06 శాతం చొప్పున ఓటింగ్‌ నమోదైంది.

రేపు కౌంటింగ్‌

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే అధికారులు బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసి, ఓట్ల లెక్కింపు కేంద్రాలకు తరలించి, స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరిచారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న దృష్ట్యా ఆయా స్ట్రాంగ్‌ రూముల వద్ద 24 గంటల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు.

చెదురుమదురు ఘటనలు

పెద్దాపురం మున్సిపాలిటీ 24వ వార్డు పోలింగ్‌ బూత్‌లో టీడీపీ కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. అక్కడే తిష్ట వేసి ఓటు వేసేందుకు వచ్చిన వారిని ప్రలోభాలకు గురి చేశారు. ఓట్లు తమకే వేయాలంటూ ఒత్తిడి చేశారని ఓటర్లు వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పట్టణంలోని 27వ వార్డులో చనిపోయిన వారి పేరిట ఓట్లు వేశారని వైఎస్సార్‌ సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలింగ్‌ అధికారులు పట్టించుకోలేదు.

ఏలేశ్వరం 3, 7వ వార్డుల్లో అభ్యర్థుల గుర్తులు తారుమారవడంతో ఓటింగ్‌ ప్రక్రియ కొంతసేపు నిలిచిపోయింది. మూడో వార్డులోని బ్యాలెట్‌ పత్రాల్లో సైకిల్‌ గుర్తుకు బదులు కమలం, ఏడో వార్డులోని బ్యాలెట్‌ పత్రాల్లో కమలం గుర్తుకు బదులు సైకిల్‌ గుర్తు ఉన్నవి సరఫరా అయ్యాయి. దీంతో, గంట పాటు పోలింగ్‌ నిలిచిపోయింది. అప్పటికే మూడో వార్డులో ముగ్గురు ఓటర్లు ఓటు వేయగా, ఇద్దరి ఓట్లు బ్యాలెట్‌ బాక్సులో పడ్డాయి. ఏడో వార్డులో కూడా తప్పుడు బ్యాలెట్‌ పత్రాలతో నలుగురు ఓటు వేయగా, ఒక ఓటు బ్యాలెట్‌ బాక్సులో పడింది. ఈలోగా అప్రమత్తమైన అధికారులు రెండు వార్డుల్లోనూ తాత్కాలికంగా పోలింగ్‌ నిలిపివేశారు. ఈ రెండు వార్డుల్లో నమోదైన మూడు ఓట్లను చెల్లుబాటు కానివిగా పరిగణించి, ఆ ఏడుగురు ఓటర్లకు తిరిగి ఓటు వేసే అవకాశం కల్పించారు.

సామర్లకోట బీబీఆర్‌ హైస్కూల్‌లో 33, 34, 35 వార్డులకు సంబంధించి ఆరు పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సరళి పరిశీలన పేరుతో ఆ బూత్‌లలోకి డీసీసీబీ చైర్మన్‌ తుమ్మల బాబుతో పాటు సుమారు 10 మంది వెళ్లారు. దీనిపై వైఎస్సార్‌ సీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ పరిస్థితి ఏర్పడింది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది.

పిఠాపురం 18వ పోలింగ్‌ బూత్‌ వద్ద అభ్యర్థులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది. బ్యాలెట్‌ బాక్సుకు సీల్‌ వేసే సమయంలో తమను బూత్‌ లోపలకు అనుమతించాలంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అయితే, ఏజెంట్లు మాత్రమే పోలింగ్‌ బూత్‌లో ఉండాలని, మిగిలిన వారు బయటకు వెళ్తే బాక్సులకు సీల్‌ వేస్తామని అధికారులు చెప్పారు.

పిఠాపురం 18, 19వ నంబర్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద జనసేనకు చెందిన కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ హంగామా చేశారు. ఇద్దరూ పోలింగ్‌ కేంద్రం లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో, రెచ్చిపోయిన జనసేన శ్రేణులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. చేసేది లేక వారిని పోలీసులు అనుమతించారు. విషయం తెలియడంతో మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ వంగా గీత అక్కడకు చేరుకుని పోలీసులకు ప్రశ్నించారు. లోపలకు ఎవరిని పంపారు? వైఎస్సార్‌ సీసీ వారిని ఎందుకు బయట ఉంచారంటూ నిలదీశారు. అక్కడున్న జనసేన కార్యకర్తలు జై జనసేన అంటూ కవ్వింపు చర్యలకు దిగగా పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సర్దుమణిగింది.

పిఠాపురం మున్సిపాలిటీ 13వ వార్డు పోలింగ్‌ బూత్‌ వద్ద టీడీపీకి చెందిన వారు దొంగ ఓట్లు వేస్తున్నారంటూ వైఎస్సార్‌ సీపీ అభ్యర్ది ఒక వ్యక్తిని పట్టుకుని అధికారులకు అప్పగించారు.

పిఠాపురం పాత బస్టాండ్‌ పాఠశాల పోలింగ్‌ బూత్‌ సమీపాన జనసేన నాయకులు, కార్యకర్తలు గుంపులుగా చేరి, ప్రధాన రహదారిపై వెళ్తున్న వారిని ఆపుతూ గ్లాస్‌ గుర్తుకు ఓటు వేయాలని గట్టిగా అరుస్తూ గాజు గ్లాసులు చూపిస్తూ ప్రచారం చేశారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిబంధనల ప్రకారం ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద వీల్‌ చైర్‌ ఏర్పాటు చేయాలి. కానీ, తుని పట్టణంలోని 56 పోలింగ్‌ కేంద్రాల్లో ఎక్కడా ఇవి అందుబాటులో లేవు. దీంతో, ఆయా కేంద్రాల్లో ఓటు వేసేందుకు దివ్యాంగులను, వృద్ధులను తీసుకు వెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు. దీనిపై మీడియా ప్రశ్నించగా తమకు వీల్‌ చైర్లు పంపించలేదని అసిస్టెంట్‌ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ చెప్పారు.

ముగిసిన మున్సి‘పోల్స్‌’

చెదురుమదురు ఘటనలు

మినహా పోలింగ్‌ పూర్తి

జిల్లాలో 70.81 శాతం ఓటింగ్‌

అత్యధికంగా గొల్లప్రోలులో

76.87 శాతం

అత్యల్పంగా తునిలో 65.84 శాతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement