● సబ్సిడీపై అమ్మకం ఒక్క రోజుకే సరి
● నిలిచిన సరఫరా
● అంతా సర్కారు ప్రచార ఆర్భాటమే
● అధిక ధరలతో సామాన్యులు సతమతం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): మార్కెట్లో ఉల్లిపాయల ధరలు సామాన్యులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు సబ్సిడీపై ఉల్లిపాయలు పంపిణీ చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రైతు బజార్లలో ప్రతి కుటుంబానికీ 2 కిలోల చొప్పున సబ్సిడీ ఉల్లిపాయలు అందిస్తామని ప్రకటించింది. కానీ, అది ఒట్టి హడావుడి, ప్రచార ఆర్భాటంగానే మిగిలింది. ఒక్క రోజు మాత్రమే సబ్సిడీపై ఉల్లిపాయలు విక్రయించి, మరుసటి రోజు నుంచి నిల్వలు లేవంటూ అధికారులు చేతులెత్తేశారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లిపాయల ధర ప్రస్తుతం రూ.75 నుంచి రూ.80 వరకూ పలుకుతోంది. రైతు బజార్లలో సైతం చిన్న సైజు ఉల్లిపాయలు కిలో రూ.50కి పైగా విక్రయిస్తున్నారు. రైతు బజారు ఆవరణలోని మున్సిపల్ షాపుల్లో కిలో రూ.75కి అమ్ముతున్నారు. నిత్యావసరమైన ఉల్లిపాయల ధరలు ఇలా పెరిగిపోవడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో కిలోల కొద్దీ కొనుగోలు చేసే వినియోగదారులు ప్రస్తుతం తక్కువ పరిమాణంతోనే సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సబ్సిడీ ఉల్లిపాయలు కొంత ఉపశమనం కలిగిస్తాయని ప్రజలు భావించారు. కానీ, రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లి అమ్మకాలు నిలిచిపోవడంతో ఒక్క రోజులోనే వారి ఆశలు ఆవిరయ్యాయి.
2 రైతు బజార్లలో 15 టన్నుల విక్రయం
కాకినాడలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపాన, గాంధీనగర్‌లోను ఉన్న రెండు రైతు బజార్లలో గత నెల 24న ఒక్క రోజు మాత్రమే సుమారు 15 టన్నుల ఉల్లిపాయలను సబ్సిడీ ధరకు విక్రయించారు. ఆ రోజు పెద్ద సంఖ్యలో వినియోగదారులు వీటిని కొనుగోలు చేశారు.
కానీ, ఆ మార్నటి నుంచే వీటి సరఫరా నిలిచిపోయింది. ఉల్లిపాయల నిల్వలు ప్రస్తుతం లేవని, సరఫరా అయిన తర్వాత మళ్లీ సబ్సిడీపై విక్రయిస్తామని అధికారులు చెబుతున్నారు. దీంతో, ప్రజలు రైతు బజార్లకు వెళ్లి, నిరాశతో వెనుదిరుగుతున్నారు. గాంధీనగర్ రైతు బజారులో కూరగాయలు కొనుగోలు చేసేందుకు ప్రతి రోజూ సుమారు 700 నుంచి 800 మంది వస్తూంటారు. వీరిలో చాలామంది సబ్సిడీ ఉల్లిపాయల కోసం ప్రత్యేకంగా ఆరా తీస్తున్నారు. అవి లేవనే సమాధానం రావడంతో నిరాశ చెందుతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజారులోను ఇదే పరిస్థితి నెలకొంది. నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే.. ముందుగానే తగినన్ని నిల్వలు సమకూర్చుకుని, నిరంతర పంపిణీకి ఏర్పాట్లు చేయాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉల్లిపాయలు ధరలు తగ్గే వరకూ వీటిని సబ్సిడీపై విక్రయించాలని కోరుతున్నారు.
సబ్సిడీ ఉల్లిపాయలు లేవంటున్నారు
బయటి మార్కెట్ ఉల్లిపాయల రేట్లు ఎక్కువగా ఉండటంతో దూరప్రాంతమైన గాంధీనగర్ రైతు బజారుకు సబ్సిడీ ఉల్లిపాయల కోసం వచ్చాను. తీరా ఇక్కడ సబ్సిడీ ఉల్లిపాయలు లేవని చెబుతున్నారు. ఇక్కడే రూ.75 పెట్టి ఉల్లిపాయలు కొనుక్కోవాల్సి వచ్చింది. కేవలం ఒక్క రోజే విక్రయించేందుకు ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రచారం చేసిందో అర్థం కావడం లేదు.
– ఏలూరి రాణి, కాకినాడ


