55 వేల హెక్టార్లలో ‘అర్నబ్‌’ పంట నష్టాలు | - | Sakshi
Sakshi News home page

55 వేల హెక్టార్లలో ‘అర్నబ్‌’ పంట నష్టాలు

Nov 2 2026 12:23 AM | Updated on Nov 2 2026 12:23 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అర్నబ్‌ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా సుమారు 55 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నష్టాల అంచనా, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ చిత్తరంజన్‌ దాస్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు బృందం ఆదివారం జిల్లాలో పర్యటించింది. ఈ బృందంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అసిస్టెంట్‌ అదనపు కమిషనర్‌ ప్రశాంత్‌ అర్మోరికర్‌, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హిమాలయ గర్గ్‌, కేంద్ర విద్యుత్‌ ప్రాధికార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రణయ్‌ గర్గ్‌ ఈ బృందంలో ఉన్నారు. వీరు తొలుత తుపాను ప్రభావం, జిల్లాలో జరిగిన నష్టం, సహాయక చర్యలకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కలెక్టరేట్‌లో తిలకించింది. అనంతరం కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా తుపానుకు ముందు చేపట్టిన అప్రమత్తత చర్యలు, తుపాను సమయంలో నిర్వహించిన సహాయ, రక్షణ కార్యక్రమాలను, అనంతరం చేపట్టిన పునరుద్ధరణ చర్యలను, వివిధ శాఖలకు వాటిల్లిన నష్టాలను కేంద్ర బృందానికి సమగ్రంగా వివరించారు. ఈ తుపాను ప్రభావంతో జిల్లావ్యాప్తంగా 53,878 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 86,897 మంది రైతులు నష్టపోయారన్నారు. అలాగే, 579 మత్స్యకార బోట్లు, 1,044 వలలు దెబ్బ తిన్నాయని, 1,588 విద్యుత్‌ స్తంభాలు, 222 ట్రాన్స్‌ఫార్మర్లు, సుమారు 214 కిలోమీటర్ల విద్యుత్‌ లైన్లకు నష్టం వాటిల్లిందని వివరించారు. మొత్తం 88.9 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రహదారులు దెబ్బ తిన్నాయన్నారు. జిల్లాలో 879 చెట్లు కూలిపోగా, వాటిని వెంటనే తొలగించి, రహదారులపై రాకపోకలను పునరుద్ధరించామని కలెక్టర్‌ చెప్పారు. కాగా, కేంద్ర బృందం తాళ్లరేవు, కాజులూరు మండలాల్లో తుపాను పంట నష్టాలను నేరుగా పరిశీలించింది.

ఉప్పాడ వద్ద పరిశీలన

కొత్తపల్లి: కేంద్ర బృందం ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించింది. తుపాను ప్రభావంతో దెబ్బ తిన్న తీరాన్ని, కోతకు గురైన మత్స్యకారుల ఇళ్లను, అలల ఉధృతికి చిన్నాభిన్నమైన ప్రాంతాలను, తీరప్రాంత రక్షణ నిర్మాణాలను పరిశీలించారు. మత్స్యకారుల జీవనోపాధిపై తుపాను ప్రభావం ఏ మేరకు ఉందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించి మత్స్యకారులకు, చేపల వేటకు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను పరిశీలించారు. దెబ్బ తిన్న నిర్మాణాలు, ఇతర ఆస్తుల నష్టానికి సంబంధించిన వివరాలను జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ కేంద్ర బృందానికి వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌, వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement