సుబ్బారావు : ఏందిరా రామకృష్ణ.. కొవ్వూరులో మున్సిపల్ ఎన్నికల సందడి మామూలుగాలేదే! ఆ ఇద్దరు నాయకుల హడావుడి చూస్తుంటే ఏదో పెద్ద పండగొచ్చినట్టుందే!
రామకృష్ణ : పండగే రా సుబ్బారావు... కాకపోతే జనాలకు కాదు.. రెండున్నరేళ్లుగా కొవ్వూరును పంచేసుకుని దోచుకుంటున్న ఆ ఇద్దరు నాయకులకేనని జనం అనుకుంటున్నారు.
సుబ్బారావు : అదేంట్రా! మున్సిపల్ కుర్చీ కోసం అంత హడావుడా? జనానికి సేవ చేయడానికి ఇంత ఖర్చు పెడతారా ఏంది?
రామకృష్ణ : ఆహా.. నీ అమాయకత్వం తగలెయ్యా! పైకి చూస్తే మున్సిపల్ ఎన్నికలు.. లోపల లెక్కలేమో వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నిధుల మీద ఉన్నాయంట!
సుబ్బారావు : అవున్లే! గోష్పాద క్షేత్రానికి పుష్కరాలప్పుడు లక్షలాది మంది భక్తులొస్తారు. ఘాట్లు బాగు చేయాలె.. రోడ్లు వేయాలె.. లైట్లు పెట్టాలె.. తాగునీళ్లు ఇవ్వాలె.. పారిశుధ్యం చూడాలె.. బోలెడన్ని పనులుంటాయ్ కదా!
రామకృష్ణ : ఆ పనులే ఇప్పుడు కొందరి కళ్లకు కనిపిస్తున్నాయటరా! పుష్కరాల కోసం ఎన్ని నిధులొస్తాయో.. ఎన్ని పనులు జరుగుతాయో.. ఏ పనులు ఎవరికి దక్కుతాయోనని ఇప్పట్నుంచే లెక్కలేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయ్!
సుబ్బారావు : ఓహో! అంటే ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు పెట్టేది.. రేపు పుష్కరాల పనుల్లో వెనకేసుకోవడానికన్నమాట?
రామకృష్ణ : అదే నిజమని నేను చెప్పట్లేదురా బాబూ.. జనం మధ్య అలాంటి అనుమానాలు, ఆరోపణలు వినిపిస్తున్నాయని చెబుతున్నా! కొవ్వూరు నియోజకవర్గాన్ని ఆ ఇద్దరు నాయకులు ఇప్పటికే పంచేసుకుని నీకది... నాకిది అన్నట్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు.. అధిక ధరలకు మద్యం విక్రయించి దోచేస్తున్నారనే రకరకాల ఆరోపణలు వినిపిస్తున్నాయ్ కదా.. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా వారి చేతిలో ఉంటే అభివృద్ధి పనులు దక్కించుకుని దోచేయొచ్చని ఆశ పడుతున్నారనే ప్రచారం జరుగుతోందిరా..!
సుబ్బారావు: నిజమేనోయ్! పుష్కరాలంటే గోదావరి తల్లి మీద భక్తి.. గోష్పాద క్షేత్రం మీద గౌరవం. ఆ పేరుతో వచ్చే నిధులతో భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి ఖర్చు పెట్టాలె గానీ.., దోచుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయడం సిగ్గుచేటు.
రామకృష్ణ : భలే చెప్పావురా! ఘాట్లు కట్టినా నాణ్యత ఉండాలె.. రోడ్లు వేసినా నిలబడాలె.. లైట్లు పెట్టినా వెలగాలె.. తాగునీళ్లు ఇచ్చినా అందరికీ అందాలె. కాగితాల మీద పనులు చూపించి, క్షేత్రస్థాయిలో సగం కూడా చేయకుండా దోచుకుంటామంటే ఎట్టా?
సుబ్బారావు : కానీ ఎన్నికలప్పుడు మాత్రం ఎవరు ఎంత ఖర్చు పెడతారోనని జనం కూడా చూస్తారుగా!
రామకృష్ణ : ఖర్చు పెట్టినోడే మంచి నాయకుడని అనుకుంటే పొరపాటే రా! ఓటు వేసేటప్పుడు ఎవరు పట్టణానికి ఏం చేస్తారో చూడాలె. గెలిచినోళ్లు ఐదేళ్లూ ప్రజలకు అందుబాటులో ఉంటారా? తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలు తీరుస్తారా? అనేది ముఖ్యం.
సుబ్బారావు : మరి పుష్కరాల పనుల మీద ఆశపడి ఆ ఇద్దరు నాయకులు కోట్ల రూపాయలు కుమ్మరించేస్తున్నారు కదా!
రామకృష్ణ : ముందే చెప్పాను కదరా.... ఇప్పటికే గత రెండున్నరేళ్లుగా నియోజకవర్గాన్ని పంచుకుని దోచుకున్న డబ్బుకి లెక్కే లేదంటరా.. ఆ డబ్బులో కొంత ఇప్పుడు ఖర్చు చేస్తే.. మళ్లీ కావాల్సినంత దోచుకునేందుకు అధికారం దక్కుతుంది కదా... అందుకనే పంచేస్తున్నారట..!
సుబ్బారావు : పుష్కరాలొచ్చినప్పుడు భక్తులు సౌకర్యంగా స్నానాలు చేసి పోవాలె. కొవ్వూరు పేరు నిలవాలె. ఘాట్లు, రోడ్లు బాగుపడాలె. అంతేగానీ కాంట్రాక్టుల పేరిట దోచేసుకుంటామంటే పట్టణం పరువేంగానురా...?
రామకృష్ణ : అందుకే ఈసారి జనం కళ్లూ చెవులూ తెరిచి ఉంచాలె. ఎన్నికల్లో ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారన్న దానికంటే.. గెలిచాక ఎవరు ఎంత పని చేస్తున్నారో లెక్క పెట్టాలె. పుష్కరాల నిధుల మీద కూడా ఓ కన్నేసి ఉంచాలె!
సుబ్బారావు : సరే గానీ రామకృష్ణ.. చివరగా ఒక్క మాట చెప్పు. కొవ్వూరు మున్సిపల్ పీఠం ప్రజలకు సేవ చేయడానికా.. పుష్కరాల పనుల మీద పెత్తనం చేయడానికా?
రామకృష్ణ : ఆ ప్రశ్నకు సమాధానం ఇప్పటికే నియోజకవర్గాన్ని పంచేసుకున్న ఆ ఇద్దరు నాయకులే చెప్పాలెరా! మున్సిపల్ కుర్చీ అంటే బాధ్యత.. పుష్కరాల నిధులంటే ప్రజల సొమ్ము. ఆ ఫలాలు గోదావరి ఒడ్డున ఉన్న జనాలకు, పుష్కరాలకు వచ్చే భక్తులకు అందాలె. అంతేగానీ ఆ ఇద్దరి నాయకుల జేబులు నింపుకొంటామంటే ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా...!!!
టీ గ్లాసులు ఖాళీ అయ్యాయ్.. కానీ ఆ ఇద్దరి స్నేహితుల ముచ్చట మాత్రం కొవ్వూరు రాజకీయాలపై ఓ ప్రశ్నను మిగిల్చింది. ఎన్నికల్లో ఖర్చు.. పుష్కరాల పనులపై ఆశలు.. అభివృద్ధి నిధుల వినియోగంపై అనుమానాలు! ఇవన్నీ ఆరోపణలుగానే ఉన్నా.. ప్రజాధనానికి లెక్క ఉండాలన్నది మాత్రం అందరి కోరిక. మున్సిపల్ పీఠం ప్రజాసేవకు వేదిక కావాలా.. రాజకీయ ప్రయోజనాలకు వేదిక కావాలా? అనేది కొవ్వూరు ఓటర్లే నిర్ణయించాలి! విజ్ఞతతో ఓటు వేసి రెండున్నరేళ్లుగా నియోజకవర్గాన్ని దోచుకుంటున్న వారికి బుద్ధి చెబుతారని ఆశిద్దాం!!
– సాక్షి, రాజమహేంద్రవరం
కొవ్వూరు పట్టణంలో ఓ టీ కొట్టు.. అక్కడ టీ తాగుతూ పాత స్నేహితులు సుబ్బారావు, రామకృష్ణ మాటల్లో పడ్డారు. వారి ముచ్చట్లు మున్సిపల్ ఎన్నికల మీదకు వెళ్లాయ్.. ఎన్నికల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధమైన ఇద్దరు నాయకులు.. రానున్న పుష్కరాలకు కొవ్వూరుకు కేటాయించే అభివృద్ధి నిధుల దోపిడీకి ఇప్పటి నుంచే ఎలా లెక్కలేసుకుంటున్నారో
అంటూ వారి మధ్య సంభాషణ సాగింది.
కొవ్వూరు మున్సిపల్ పీఠంపై
ఆ ఇద్దరు నేతల కన్ను
ఓటర్లకు విస్తృతంగా
డబ్బు, మద్యం పంపిణీకి ఏర్పాట్లు
పుష్కర పనుల్లో
తిరిగి నిధుల దోపిడీకి స్కెచ్


