లో
నిన్నటి వరకూ కాస్త ఆకుపచ్చగా, కాస్త పసిడి వర్ణాన్ని అద్దుకుంటూ దర్శనమిచ్చిన పైర్లు.. ఇప్పుడు తలలు వాల్చి, నేలనంటేసి, నీటిలో నానుతూ కనిపిస్తున్నాయి. కంకులు వేస్తూ, కళకళలాడుతున్న పంట చేతికొస్తుందనుకున్న సమయంలో విరుచుకుపడిన అర్నబ్.. అన్నదాతల ఆశల పందిరిని నిర్దాక్షిణ్యంగా నేల కూల్చేసింది. అప్పోసొప్పో తెచ్చి పెట్టుబడులు పెట్టి, రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట.. తుపాను ధాటికి కేవలం గంటల వ్యవధిలో కళ్ల ముందే సర్వనాశనమవడంతో రైతన్నల దుఃఖానికి అంతే లేకుండా పోతోంది. గుండె పగిలిన అన్నదాతలు ఆదుకునే హస్తం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆశల పందిరి..
నేల కూలింది
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కొద్ది రోజులు గడిస్తే పంట చేతికొచ్చేసేదే! మరో 15 రోజుల్లో వరి కోతలు ప్రారంభమై, పసిడి గింజలు ఇంటికి చేరుకునేవే! కానీ, ఇంతలోనే అశనిపాతంలా విరుచుకుపడిన అర్నబ్ తుపాను అన్నదాతల ఆశలను ఆవిరి చేసింది. తుపాను ప్రభావంతో రెండు రోజుల పాటు వీచిన పెను గాలులు, కురిసిన భారీ వర్షాలతో జిల్లా రైతులకు తీరని నష్టం వాటిల్లింది. సుమారు 1.25 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, మినుము, పత్తి, చెరకు తదితర పంటలు నేలకొరిగి, నీట నానుతున్నాయి. నెలల తరబడి శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నాశనమవడంతో అన్నదాతలు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆశలు చిదిమేసిన తుపాను
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది సుమారు 2 లక్షల ఎకరాల్లో రైతులు ఖరీఫ్ వరి సాగు చేపట్టారు. మొదట్లో వాతావరణం అనుకూలంగా ఉండటం, పంట ఏపుగా పెరగడంతో వారిలో ఆశలు చిగురించాయి. సాగు ఖర్చు లు పెరిగినా మంచి దిగుబడి వస్తే అప్పులు తీర్చుకోవచ్చని, కుటుంబ అవసరాలు తీర్చుకోవచ్చని, తరు వాతి సీజన్‌కు పెట్టుబడి సమకూర్చుకోవచ్చని భావించారు. ఎకరాకు 30 బస్తాలకు పైగా దిగుబడి వస్తుందని అంచనా వేసుకున్నారు. ధరలు అనుకూలిస్తే ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకూ ఆదా యం వస్తుందని ఆశించారు. కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో విరుచుకుపడిన తుపాను వారి ఆశలను చిదిమేసింది. ధాన్యం గింజలు గట్టిపడి, పంట పక్వానికి వస్తున్న సమయంలో కురిసిన భారీ వర్షాలు, వీచి న ఈదురు గాలులకు వరి కంకులు బరువెక్కి నేలనంటేసి, నీట నానుతున్నాయి. దీంతో, ధాన్యం నాణ్యత దెబ్బ తింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తగ్గి, నీరు బయటకు వెళ్లినా, నేల వాలిన పంటను కోయడం కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా యంత్రాలతో కోతలు చేపడితే ఖర్చులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ధాన్యం సేకరణలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.
పెట్టుబడి దక్కని దుస్థితి
ఖరీఫ్ వరి సాగుకు రైతులు ఎకరాకు సుమారు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ అప్పులు చేసి మరీ పెట్టుబడి పెట్టారు. పంట చేతికొస్తే ఆ అప్పులు తీర్చుకోవచ్చని ఆశించారు. తీరా చూస్తే అర్నబ్ తుపాను తమ ఆశలను తలకిందులు చేసిందని, పంట దెబ్బ తినడంతో పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం
తుపాను ప్రభావంతో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదం ఉంది. జిల్లాలో లక్ష మందికి పైగా కౌలు రైతులున్నారన్నది వ్యవసాయ అధికారుల అంచనా . ఈ ఏడాది అనేక మంది ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ కౌలును ముందుగానే చెల్లించి మరీ వరి సాగు చేపట్టారు. సాగు కోసం అదనంగా అప్పులు కూడా చేశారు. ఇప్పుడు తుపాను విరుచుకుపడటంతో కౌలు ఖర్చులతో పాటు పెట్టుబడి కూడా నష్టపోయే దుస్థితిని వారు ఎదుర్కొంటున్నారు. భూమి యజమానులకే కాకుండా వాస్తవంగా పంట సాగు చేసిన తమకు కూడా నష్టం అంచనాల్లో తగిన గుర్తింపు ఇవ్వాలని కౌలు రైతులు కోరుతున్నారు.
పంటల బీమా లేక..
పంటల బీమా చేయించుకోని తుపాను నష్టపరిహారం అందుతుందా లేదా అనే సందేహాలు పలువురు రైతుల్లో నెలకొన్నాయి. పంట నష్టం తీవ్రంగా ఉన్నప్పటికీ బీమా లేకపోవడం వల్ల ఆర్థిక సహాయం అందకపోతే తమ పరిస్థితేం కావాలని వారు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉచిత పంటల బీమా వర్తింపచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకానికి తూట్లు పొడిచారు. ఎకరాకు రూ.700 పైగా ప్రీమియం చెల్లించలేక చాలా మంది రైతులు పంటల బీమాకు దూరమయ్యారు.
8
పదెకరాల్లో పంట నష్టం
కిర్లంపూడిలో సుమారు పదెకరాలు కౌలుకు తీసుకుని వరి పంట వేశాను. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టాం. వరి చేలు పొట్ట దశలో ఉన్న సమయంలో వచ్చిన తుపాను ప్రభావంతో భారీ గాలులు వీయడంతో మొత్తం పదెకరాల్లోని వరి పంటా నేలకు ఒరిగిపోయింది. సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలి, రైతుకు కౌలు ఎలా కట్టాలో అర్థం కావడం లేదు.
– అడారి తాతీయులు, కౌలు రైతు, కిర్లంపూడి
‘అర్నబ్’తో అల్లకల్లోలం
జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో
నేలకొరిగిన పంటలు
చేతికందే సమయంలో ప్రకృతి ప్రకోపం
అన్నదాతల ఆశలపై నీళ్లు
ఎకరాకు రూ.25 వేల నుంచి
రూ.30 వేల పెట్టుబడి
దిగుబడి పడిపోతే అప్పుల
ఊబిలోకి రైతులు
రైతులను ఆదుకోండి
తుపాన్లతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సీఎం చంద్రబాబుకు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఫొటోలు, వీడియోలు, సమీక్షల పేరుతో ప్రచారార్భాటం చేస్తున్నారు. గత ఏడాది సంభవించిన మోంథా తుపాను ధాటికి జిల్లాలో 50,812 ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. రైతులకు సుమారు రూ.150 కోట్ల మేర నష్టం వాటిల్లితే ప్రభుత్వం మాత్రం రూ.52.17 కోట్లుగానే లెక్క తేల్చింది. ఈ విపత్తు సంభవించి ఏడాదవుతున్నా నేటికీ నయా పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు అర్నబ్ తుపాను రైతులు, మత్స్యకారులు, ప్రజలను కోలుకోలేని విధంగా దెబ్బ తీసింది. వరితో ఉద్యాన పంటలు నేటమట్టమయ్యాయి. బోట్లు దెబ్బ తిని మత్స్యకారులు నష్టపోయారు. కోనసీమ జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు తుపాను బాధితులకు నిత్యావసరాలు, దెబ్బ తిన్న కొబ్బరి చెట్టుకు రూ.1,500 ఇస్తామనడం కాదు.. వరి, ఉద్యాన పంటలు నష్టపోయిన రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి. ఎకరానికి ఎంత ఇస్తారో స్పష్టంగా వెల్లడించాలి. పడవలు, వలలు కోల్పోయిన మత్స్యకారులను కూడా ఆదుకోవాలి. కాకి లెక్కలు మాని, వాస్తవ నష్టాన్ని ప్రకటించాలి. మోంథా తుపాను పరిహారం ఎప్పుడిస్తారో కూడా స్పష్టత ఇవ్వాలి.
– దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు


