కార్పొరేషన్‌ ఎన్నికలకు కుట్రపూరిత రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ ఎన్నికలకు కుట్రపూరిత రాజకీయాలు

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

● విలీన గ్రామాలను ఎందుకు చేర్చలేదు?

● తుపాను వేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ,

మహిళా ఓటర్ల సర్వేనా?

● మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

● మాజీ మంత్రి కురసాల కన్నబాబు

కాకినాడ రూరల్‌: కాకినాడ నగర పాలక సంస్థ ఎన్నికలకు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ కాకినాడ రూరల్‌ కో ఆర్డినేటర్‌ కురసాల కన్నబాబు మండిపడ్డారు. రమణయ్యపేట వైద్య నగర్‌లోని తన క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తాను తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాకినాడ రూరల్‌లోని రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, తూరంగి, ఇంద్రపాలెం, చీడిగ, స్వామి నగర్‌, ఎస్‌.అచ్యుతాపురం గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేసేందుకు ప్రతిపాదించామని గుర్తు చేశారు. టీడీపీతో పాటు మరికొందరు కోర్టులో కేసులు వేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. ఎస్‌.అచ్యుతాపురం, స్వామి నగర్‌లను విలీనం చేసినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కార్పొరేషన్‌ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. మరోవైపు కోర్టుల్లో కేసులు కొట్టివేశారని, ఈ నేపథ్యంలో విలీన ప్రతిపాదిత గ్రామాలను చేర్చకుండా ఎన్నికలు నిర్వహించేందుకు ఎందుకు కుట్రలు చేస్తున్నారని ప్రశ్నించారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను వార్డుల వారీగా గుర్తించేందుకు షెడ్యూల్‌ ఇచ్చారని, దీని ప్రకారం ఈ నెల 25, 26 తేదీల్లో వార్డుల వారీగా ఇంటింటి సర్వే నిర్వహించాల్సి ఉందని చెప్పారు. గుర్తించిన ఓటర్లతో ఈ నెల 27న ముసాయిదా జాబితా ప్రచురించి, 28న అభ్యంతరాలు స్వీకరించి, వాటిపై 29న క్షేత్ర స్థాయి పరిశీలన జరిపి, తుది జాబితా ప్రచురించాలని ఉందని తెలిపారు. అర్నబ్‌ తుపాను విలయం సృష్టించిన ఈ సమయంలో అధికారులు, సిబ్బంది ఈ తేదీల్లో పని చేయగలుగుతారా అని కన్నబాబు ప్రశ్నించారు. అలా క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండా కార్యాలయాల్లో కూర్చుని రాయడం న్యాయమేనా అని నిలదీశారు. తీవ్ర తుపాను వచ్చినప్పుడు కనీసం షెడ్యూల్‌ మార్చి, పారదర్శకంగా ఓటర్ల గుర్తింపు చేపట్టకుండా మమ అనిపిస్తున్నారని అన్నారు. తుపాను ధాటికి ఈ నెల 27, 28 తేదీల్లో కోస్తా ప్రాంతాల్లో రోడ్లపై తిరిగే పరిస్థితి లేదని, కానీ కాకినాడలో మాత్రం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల గుర్తింపు అయిపోయిందనడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. ఏం సాధించాలని ఇంత దుర్మార్గంగా కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలందరూ బాధల్లో ఉంటే ఎన్నికల కోసమే అన్నట్లు ప్రభుత్వం పని చేయడం సరికాదని అన్నారు. ఓటర్ల గుర్తింపునకు మళ్లీ షెడ్యూల్‌ ప్రకటించి, నోటిఫికేషన్‌ ఇచ్చి, ప్రజలు అభ్యంతరాలు తీసుకుని, అప్పుడు మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని కన్నబాబు అన్నారు. రాజకీయాల కోసం వెచ్చించే సమయంలో కొద్ది శాతం ప్రజల కోసం కేటాయించాలని చంద్రబాబుకు సూచించారు. విలేకర్ల సమావేశంలో పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు గోపుశెట్టి బాబ్జీ, నాయకులు కరీం బాషా, కొప్పిశెట్టి శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement