కాకినాడ క్రైం: అర్నబ్ తుపాను ఉధృతికి అంతర్వేది తీరానికి కొట్టుకొచ్చిన వాణిజ్య నౌక సిగ్మపెర్ల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది. కాకినాడ కోస్ట్‌గార్డ్ కల్నల్ రంజిత్ ఆధ్వర్యంలో సిబ్బంది నౌకలో ప్రయాణిస్తున్న 20 మందిని రక్షించారు. సుజయ్ నౌక కోస్ట్‌కార్డు సిబ్బందిని విజయవంతంగా సిగ్మపెరల్ వద్దకు చేర్చింది. గురువారం నిర్వహించిన ఈ రెస్క్యూలో సాంకేతిక కీలక పాత్ర పోషించింది. విశాఖపట్నం నుంచి సింగపూర్ వెళ్తున్న వాణిజ్య నౌకలో 20 మంది సిబ్బంది ఉండగా వారంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. నౌక పరిస్థితిని అధికారులు అంచనా వేస్తున్నారు. నౌక పొట్టభాగం (హల్), అంతర్గత యంత్రాలకు ఏమైనా నష్టం వాటిల్లిందా, సమీప తీరానికి నౌకను చేర్చగలమా అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
గంజాయి తరలిస్తున్న
యువకుడి అరెస్ట్
అనపర్తి: గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై వి.సుజాత తెలిపిన వివరాల ప్రకారం.. అనపర్తి ఐఎల్‌టీడీ జంక్షన్ సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తుండగా జీబీఆర్ కళాశాల ఎదురుగా ఉండే కాలనీలో నివాసం ఉండే కొల్లాటి శ్రీతేజ అనే 19 ఏళ్ల యువకుడి వద్ద రూ.2 లక్షల విలువైన నాలుగు కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు. అతడిని విచారించగా వివిధ పోలీస్టేషన్ల పరిధిలో 9 మోటార్ బైక్‌లను కూడా చోరీ చేసినట్టు అంగీకరించాడన్నారు. దీంతో ఆ వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
యువతిని వేధిస్తున్న
యువకుడి అరెస్ట్
మాదాపూర్: యువతిని వేధిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్‌స్పెక్టర్ కేవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ సమీపంలోని మాధవరానికి చెందిన నూతిగట్టు వీర వెంకట సంతోష్ దుర్గ (27) ఏఎంఆర్ గ్రూప్‌లో డ్రైవర్‌గా పనిచేస్తూ జూబ్లిహిల్స్‌లో నివాసముంటున్నాడు. నిందితుడికి, బాధితురాలికి చుట్టరికం ఉండడంతో 2022లో వీరి మధ్య పరిచయం ఏర్పడింది. అతడి అనుమానాస్పద ధోరణి నచ్చక పోవడంతో యువతి అతడితో మాట్లాడడం మానేసింది. దీంతో సంతోష్ దుర్గ ఆమెను మానసికంగా వేధించడం, తమ పాత ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపుతానని బెదిరించాడు. దీంతో ఆమె గచ్చిబౌలి షీ టీమ్‌కు ఫిర్యాదు చేసింది. వారు కౌన్సిలింగ్ ఇచ్చినా వేధింపులు మానకపోవడం, ఈ నెల 28న హైటెక్ సిటీలోని టెక్ మహేంద్ర కార్యాలయానికి వెళ్లి బాధితురాలిని ఇబ్బందికి గురిచేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
మోటారు సైకిళ్లు ఢీకొని
వ్యక్తి మృతి
ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
పెద్దాపురం: మహారాణి కళాశాల సమీపంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. పెద్దాపురం ప్రసన్నాంజనేయ నగర్‌కు చెందిన నరాల సత్యనారాయణ (55) సామర్లకోట వైపు నుంచి బైక్‌పై పెద్దాపురం వైపు వస్తున్నారు. ఈ క్రమంలో మహారాణి కళాశాల వద్ద ఆయన యూ–టర్న్ తీసుకుంటుండగా, ఎదురుగా అతివేగంగా వస్తున్న మరొక బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో బైక్‌పై ప్రయాణిస్తున్న కె.సాయికుమార్ (19), జె. గంగాధర్ (19)లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన ఇద్దరు యువకులను పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం 108 అత్యవసర వాహనంలో కాకినాడ ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దాపురం పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి దర్యాప్తు చేపడుతున్నారు.


