తుని: బియ్యం ధరలు ప్రజలకు అందుబాటులో లేని రీతిలో పెరిగిపోవడానికి చంద్రబాబు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. కోట్లాది టన్నుల బియ్యం నిల్వలున్నా కృత్రిమ కొరత సృష్టించి, బినామీల కోసం ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని దుయ్యబట్టారు. తుని పట్టణంలోని 22, 26, 30 వార్డుల్లో వైఎస్సార్ సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి పిట్ల రామ తులసి, కౌన్సిలర్ అభ్యర్థులు కొండా ఉమ, దాడి లక్ష్మీరమ, కుసనంపూడి శ్రీనివాసవర్మలతో కలసి గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గవరపేట ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారం చేపట్టారు. ఇంటింటికీ వెళ్లి చైర్‌పర్సన్ అభ్యర్థి పిట్ల రామ తులసి, కౌన్సిలర్ల అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టణాభివృద్ధిని కోరుకునే వారందరూ వైఎస్సార్ సీపీకి మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. కూటమి మోసపూరిత హామీలను నమ్మవద్దని సూచించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు అన్నవరం శ్రీను, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ కలిదిండి సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.
ముంపు సమస్యపై మండిపాటు
తొండంగి: పోలవరం కాలువ గట్టు కారణంగా వర్షాలు కురిసిన ప్రతిసారీ చాలా కాలం నుంచి ముంపు సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బెండపూడి పంచాయతీ తారకరామా కాలనీ ప్రజలు గురువారం జాతీయ రహదారిపై గురువారం ఆందోళన నిర్వహించారు. అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మొర పెట్టుకుంటున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ సుమారు 300 మందికి పైగా హైవేపై మెయిన్ సెంటర్ వద్ద సుమారు గంటపాటు వాహనాలను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించారు. దీంతో, అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న గ్రామస్తులతో పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్చలు జరిపారు. పోలవరం కాలువ గట్టు నుంచి వరద నీరు బయటకు పంపించేందుకు చర్య లు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పనులు తక్షణమే ప్రారంభించాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. గత్యంతరం లేక అధికారులు చివరకు జేసీబీ తీసుకొచ్చి ముంపు నీటిని బయటకు పంపించే పనులు ప్రారంభించారు. దీంతో, కాలనీ వాసులు ఆందోళన విరమించారు.
రిజిస్ట్రేషన్లకు బ్రేక్
కాకినాడ లీగల్: ఆన్‌లైన్ చలానాల నమోదు ప్రక్రియలో సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్లకు అంతరాయం ఏర్పడింది. రిజిస్ట్రేషన్ల కోసం చెల్లించిన చలానాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు గురువారం సాయంత్రం 4.30 గంటల నుంచి ప్రయత్నించినా ఫలితం లేక రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ముందుగానే సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన క్రయవిక్రయదారులు గంటల తరబడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 7 గంటలకు కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో నిరాశ చెందారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి, రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు అంతరాయం కలగకుండా చూడాలని వారు కోరుతున్నారు.
పంపా పరవళ్లు
అన్నవరం: అర్నబ్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పంపా రిజర్వాయర్ పరవళ్లు తొక్కుతోంది. రిజర్వాయర్ నీటిమట్టం బుధవారం సాయంత్రం 100 అడుగులుండగా గురువారం సాయంత్రానికి 101.3 అడుగులకు పెరిగింది. పంపా గరిష్ట నీటిమట్టం 103 అడుగులు. పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూండటంతో రిజర్వాయర్‌లోకి 1,600 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 0.43 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.36 టీఎంసీలుగా ఉందని అధికారులు తెలిపారు. గురువారం రాత్రి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంపా నీటిమట్టం 102 అడుగులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా పంపా బ్యారేజీ మూడో నంబర్ గేటు ఎత్తి 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పెద్దాపురం ఇరిగేషన్ డివిజన్ ఈఈ జి.శేషగిరిరావు తెలిపారు.


