ఫ మందుల దందా | - | Sakshi
Sakshi News home page

ఫ మందుల దందా

Oct 20 2026 12:14 AM | Updated on Oct 20 2026 12:14 AM

కాకినాడ క్రైం: జిల్లా మార్కెట్‌ను నాసిరకం మందులు ముంచెత్తుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ప్రాపగండా కమ్‌ డిస్ట్రిబ్యూషన్‌ (పీడీ) కంపెనీలుగా పిలిచే నాణ్యతా ప్రమాణాలు లేని డొల్ల ఫార్మసూటికల్‌ కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటికి కొందరు వైద్యులు అమ్ముడుపోతూ, ఇవి తయారు చేసే నాసిరకం మందులను తమ వద్దకు వచ్చే రోగులకు రాస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 150 హోల్‌సేల్‌, 1,050 రిటైల్‌ మెడికల్‌ షాపులున్నాయి. జిల్లా మార్కెట్లో 200 కంపెనీలు ఔషధాలు విక్రయిస్తున్నాయి. వీటిలో 50 నుంచి 60 మాత్రమే బ్రాండెడ్‌ కంపెనీలు. మిగిలినవన్నీ పీడీ కంపెనీలే కావడం గమనార్హం.

‘పీడీ’ కంపెనీల పీడ

ప్రతి మందులో కీలకమైనది క్రియాశీల ఔషధ పదార్థం (యాక్టివ్‌ ఫార్మాసిటికల్‌ ఇన్‌గ్రేడియంట్‌ – ఏపీఐ). దీని పరిమాణం, నాణ్యతలో లోపం ఉంటే ఆ మందు ఎందుకూ పని చేయదు. నాసిరకం మందుల్లో ఈ ఏపీఐ సరైన మోతాదులో ఉండదు. ఉదాహరణకు మాత్ర ప్యాకింగ్‌ స్ట్రిప్‌పై పారాసిటమాల్‌ 500 ఎంజీ అని ఉంటే, మాత్ర లోపల 500 ఎంజీ ఉండదు. అంతకు తక్కువ ఉండొచ్చు. ఒక మాత్ర వేసుకోవడానికి బదులు కనీసం రెండు మూడు వాడాల్సి వస్తుంది. దీంతో, రోగికి కొనుగోలు ఖర్చు పెరుగుతుంది. ఇటువంటి మాత్రల తయారీలో బాగా తక్కువ నాణ్యత ఉన్న ముడి పదార్థాలనే వాడతారు. వీటిలో మలినాల స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇది మందు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మందు శరీరంలో కరిగే గుణం (డిసొల్యూషన్‌) నాసిరకం మందుల్లో లోపిస్తుంది. నాణ్యత ఉంటే నిర్ణీత సమయానికే శరీరంలో కరిగి, రక్తంలో కలిసి మందు పని చేయడం మొదలవుతుంది. పీడీ కంపెనీలు విక్రయించే మందుల తయారీ గుడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్స్‌ (జీఎంపీ) సర్టిౖఫైడ్‌ పరిశ్రమల్లో జరగదు. వీటిని తక్కువ ధరకు, గుర్తింపు లేని ప్లాంట్లలో తయారు చేయిస్తారు. ఇటువంటి నాసిరకం మందులు గడువు పూర్తి కాకుండానే నాణ్యత కోల్పోవచ్చు. వేడి, తేమకు ఇట్టే ప్రభావితమైపోవడంతో వీటి పనితీరు మందగిస్తుంది. వీటి పనితీరుపై పరీక్షలు సరిగా నిర్వహించరు. దీంతో, వీటితో ఆశించిన పనితీరు (థెరపాటిక్‌ ఎఫెక్ట్‌) ఉండదు. దీంతో, నాణ్యమైన మాత్ర ఒకటి వాడితే వచ్చే ఫలితం.. కనీసం పీడీ మాత్రలు కనీసం మూడు నాలుగు వాడితేనే కానీ రాదు. యాంటీ బయోటిక్స్‌, అత్యవసర చికిత్సలో వినియోగించే, దీర్ఘకాలిక వ్యాధులకు ఉపయోగించే మందుల విషయంలో నాణ్యత అత్యంత కీలకం.

జనరిక్‌కు ప్రోత్సాహమేదీ!

బ్రాండెడ్‌ జనరిక్‌ మందులు పూర్తి నాణ్యమైనవి. ఇవి 40 నుంచి 80 శాతం మేర తక్కువ ధరకే లభిస్తాయి. వీటిని ప్రోత్సహించేందుకు అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు. జనరిక్‌ మందుల వినియోగం పెరిగితే వైద్యులు, మామూలు మందుల వ్యాపారుల లాభాలకు గండి పడుతుంది. దీనివలన వారి నుంచి కొంత మంది అధికారులకు వచ్చే తాయిలాలు తరిగిపోతాయి. అందుకే జనరిక్‌ మందులు విపణిలోకి వచ్చి పదేళ్లు దాటినా ఇప్పటికీ తగిన ఆదరణ లేదనే విమర్శ ఉంది.

అటాచ్డ్‌ కౌంటర్ల దందా

ప్రతి ప్రైవేటు ఆసుపత్రికి దాదాపుగా అక్కడి యజమాని లేదా వైద్యుడికి చెందిన ఓ అటాచ్డ్‌ కౌంటర్‌ ఉంటోంది. వీటిలో అన్ని మందులూ దొరకవు. తన వద్దకు వచ్చే మందుల కంపెనీల ప్రతినిధులు ఎరజూపే ప్రయోజనాల ఆధారంగా సదరు వైద్యులు వారికి ఆర్డర్లు ఇస్తారు. ఆ మందులే రాస్తారు. బ్రాండెడ్‌ కంపెనీవి కాకపోవడంతో ఆ మందులు ఆ అటాచ్డ్‌ కౌంటర్లలో తప్ప బయట మరెక్కడా దొరకవు. మార్కెట్‌ అంతటా కొనుగోలుదారులకు 10 నుంచి 20 శాతం డిస్కౌంట్‌ లభిస్తూంటే అటాచ్డ్‌ కౌంటర్లలో నయాపైసా కూడా డిస్కౌంట్‌ ఇవ్వరు. పైగా ఈ దుకాణదారులు డిమాండ్‌ చేసి మరీ బయట దుకాణాల కంటే ఎక్కువగా కంపెనీల నుంచి మార్జిన్లు పొందుతారు. ఈ అటాచ్డ్‌ కౌంటర్‌ దందాను పర్యవేక్షించే వ్యవస్థ చతికిలబడటంతో వాళ్లు చెప్పిన ధరలకే రోగులు మందులు కొనాల్సిన పరిస్థితి.

శాంపిల్స్‌ విక్రయం

ఫార్మా కంపెనీలు తమ మందులను శాంపిళ్ల రూపంలో వైద్యులకు ఇస్తూంటాయి. వీటిని కొందరు వైద్యులు, ఆర్‌ఎంపీలు, మందులు దుకాణదారులు యథేచ్ఛగా విక్రయిస్తారు. ఇవి అమ్మేందుకు కాదని స్ట్రిప్స్‌పై రాసి ఉన్నా ఆ భాగాన్ని కత్తిరించి అమ్ముతారు. వీటి వల్ల ఏవైనా సమస్యలు తలెత్తితే బిల్లులు లేక రోగులు అన్యాయమైపోతారు. చట్టపరమైన చర్యలకు కూడా అవకాశం ఉండదు.

ప్రభుత్వ మందులు వాడదామంటే..

నాసిరకం కాకుండా ప్రభుత్వ మందులు వాడదామన్నా మరో సమస్య ఎదురవుతోంది. ఈ మందుల తయారీలో ఎటువంటి మేకింగ్‌ టెక్నాలజీ వినియోగించరు. దీనివలన ఆ మందులోని రసాయనం రుచిని రోగి భరించాల్సి వస్తుంది. దీంతో, ఈ మందుల వాసన, గాఢత తీవ్రంగా ఉంటున్నాయని రోగులు వాపోతున్నారు. స్ట్రిప్‌లు, వాటిపై ప్రింటింగ్‌ కూడా తగిన నాణ్యతతో లేకపోవడం, పనితీరు కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రభుత్వ మందులు ప్రజల నమ్మకాన్ని చూరగొనలేకపోతున్నాయి.

ఫ మార్కెట్‌ను ముంచెత్తుతున్న

నాసిరకం మందులు

ఫ అడ్రస్‌ లేని కంపెనీల మందులు రాస్తున్న కొందరు వైద్యులు

ఫ వారితో వ్యాపారుల కుమ్మక్కు

ఫ తనిఖీలు మరచిన అధికారులు

ఫ రోగుల ప్రాణాలతో చెలగాటం

నాసిరకం మందులు గుర్తించడం ఇలా..

ఫ సీసా లేదా స్ట్రిప్‌లపై గడువు తేదీ తప్పక చూడాలి.

ఫ తేదీలు చెరిపేసినట్లు, మార్చినట్లు, అస్పష్టంగా ఉంటే అప్రమత్తంగా ఉండాలి.

ఫ స్ట్రిప్‌పై ఉన్న వివరాలు అవి ఉంచిన పెట్టెతో సరిపోలుతున్నాయో లేదో చూసుకోవాలి, అక్షర దోషాలు, ముద్రణ లోపాలుంటే నాసిరకం కావచ్చు.

ఫ క్యాప్సుల్‌ పగలడం, స్ట్రిప్‌కు అంటుకోవడం, లీకేజీ, సీల్‌ తెరచుకోవడం, బాటిల్‌ మూత దెబ్బ తినడం, సిరప్‌లో అసాధారణ కణాలు, రంగు మార్పు లేదా గడువు ముగియక ముందే అనూహ్య మార్పులు కనిపిస్తే నాసిరకంగా గుర్తించాలి.

ఫ కోల్డ్‌ చైన్‌ నిర్వహణ లేకపోయినా, అధిక వేడిమి లేదా చల్లదనంలో ఉన్నా, లేబుల్‌పై రాసి ఉన్న ఉష్ణోగ్రతలో ఉంచకుండా విక్రయించినా మందుల్లో నాణ్యతా లోపాలు తలెత్తవచ్చు.

ఫ భారత ప్రభుత్వ ఔషధ నియంత్రణ మండలి (సీడీఎస్‌సీవో) ప్రతి నెలా నాట్‌ ఆఫ్‌ స్టాండర్డ్‌ క్వాలిటీ (ఎన్‌ఎస్‌క్యూ) మందుల జాబితాను సీడీఎస్‌సీవో వెబ్‌సైట్‌లో ప్రకటిస్తుంది. ఇందులోనే వివిధ మందులపై అందిన ఫిర్యాదుల వివరాలు కూడా ఎప్పటికప్పుడు పొందుపరుస్తారు. నాసిరకం ఔషధాలను గుర్తిస్తే స్థానిక ఔషధ నియంత్రణాధికారి, సీడీఎస్‌సీవో వెబ్‌సైట్‌, డీసీఐ.ఎన్‌ఐసీ.ఇన్‌ లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800–11–1454కు ఫిర్యాదు చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement