పొత్తులు.. పెటాకులు! | - | Sakshi
Sakshi News home page

పొత్తులు.. పెటాకులు!

Oct 19 2026 12:14 AM | Updated on Oct 19 2026 12:14 AM

సాక్షి ప్రతినిధి, కాకినాడ: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పొత్తు పెటాకులైంది. ఏకంటా ఇరు పార్టీ అధినాయకత్వ నిర్ణయాన్ని టీడీపీ శ్రేణులు ధిక్కరించారు. టీడీపీ సభ్యతానికి గుడ్‌బై చెప్పారు. స్వతంత్ర అభ్యర్థులుగా మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా జనసేన నేతలపై పోరుకు దిగుతున్నట్లు ప్రకటించారు. పట్టణ సంగ్రామం వేళ చోటుచేసుకున్న కీలక పరిణామం ఆయా పార్టీల నేతల్లో చర్చనీయాంశంగా మారింది.

మూకుమ్మడి రాజీనామాలకు..

పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు పురపాలక సంఘాలు జనసేనకు కేటాయించారు. ఈ పరిణామం టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి సెగ రగిల్చింది. అనేక ఏళ్లుగా టీడీపీ కోసం శ్రమిస్తుంటే.. తమను కనీసం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్‌కళ్యాణ్‌ విజయం కోసం వాడుకుని.. గద్దెనెక్కాక తమను విస్మరిస్తున్నారని మండిపడుతున్నారు. రెండు మున్సిపల్‌ పీఠాలు సైతం జనసేనకు కేటాయించడంపై జీర్ణించుకోలేకపోయారు. కనీసం ఒక్క మున్సిపల్‌ పీఠమైనా టీడీపీకి కేటాయించరా..? అంటూ ప్రశ్నించారు. కూటమిలో తమకు కనీసం గౌరవం లేదనప్పుడు ఎందుకు ఉండాలంటూ నిర్ణయించుకున్నారు. కూటమిలో ఉంటే కూటమి ధర్మాన్ని పాటించి జనసేన నేతల విజయానికి పనిచేయాలని, జనసేన పల్లకీ మోసే ఓపిక తమకు లేదని ప్రకటించారు. కష్టం మాది.. పదవులు మాత్రం మీరు అనుభవిస్తారా..? అని ఆవేదన చెందారు. నియోజకవర్గంలో తమ సత్తా ఏంటో జనసేనకు చూపిస్తామని అల్టిమేటం జారీ చేశారు. బీ– ఫారాలు తమకు ఇవ్వకపోతే టీడీపీలో తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు హెచ్చరించారు. పార్టీ పదవులకు రాజీనామాలు చేసి రెబల్‌ అభ్యర్థులుగా బరిలో దిగనున్నట్లు ప్రకటించారు. ఈ తరుణంలో వ్యూహాత్మకంగా ఇప్పటికే అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు దాఖలు చేశారు. పిఠాపురం మున్సిపాలిటీలో 36 వార్డులు, గొల్లప్రోలు మున్సిపాలిటీలోని 23 వార్డులకు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. ముందస్తు జాగ్రత్తగా ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేయడాన్ని బట్టి చూస్తుంటే, జనసేనపై అంతర్గతంగా టీడీపీ నేతలు రగిలిపోతున్న తీరు అర్థమవుతుంది. వార్డు సభ్యులతో ఆగకుండా మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాలకు సైతం జన సైనికులకు పోటీగా ధీటైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నారు. పదవుల్లో ఉంటే కూటమి కట్టుబాట్లకు కట్టుబడి ఉండాలని, అందుకే పార్టీ పదవులను వదులుకొని స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నట్లు బహిరంగ ప్రకటన చేయడం కలకలం రేపుతోంది. నామినేషన్లు పూర్తయిన సందర్భంలో ఈ ప్రకటన చేయడం జనసేన శ్రేణులకు మింగుడుపడటం లేదు. దీని వెనుక టీడీపీ సీనియర్‌ నేత వర్మ ఉన్నట్లు తెలిసింది. వర్మ వర్గానికి ప్రాధాన్యం దక్కలేదన్న ఉద్దేశంతో పోరుకు తమ సొంత వర్గాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.

కొనసాగుతున్న ముసలం

గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపల్‌ సీట్ల కేటాయింపు విషయంలో ఇప్పటికే టీడీపీ, జనసేన మధ్య అసమ్మతి సెగ కొనసాగుతోంది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే గొల్లప్రోలులో టీడీపీ నేతలు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. పార్టీ కోసం కేసులు, దెబ్బలు తిన్నా కనికరం లేదా..? అని ప్రశ్నించారు. మంత్రి లోకేష్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేసినా.. టీడీపీ అధిష్టానం స్పందించకపోవడంపై అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. సొంత ప్రయోజనాల కోసం కార్యకర్తలను బలిచేస్తున్నారా..? అన్న అనుమానం కలుగుతోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

అసలేం జరుగుతోంది..?

జనసేనలో అసలు ఏం జరుగుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. జనసేన రెబల్‌ అభ్యర్థిగా డాక్టర్‌ ఏళ్ల వినయ్‌ నామినేషన్‌ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థుల రేసులో మొదటి నుంచి డాక్టర్‌ విజయశేఖర్‌తో పాటు, ఏళ్ల వినయ్‌, దానం లాజర్‌బాబు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తొలుత డాక్టర్‌ విజయశేఖర్‌ను చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించిన జనసేన, అనంతరం రాత్రికి రాత్రే రెండో పేరుగా దానం లాజర్‌బాబును ప్రకటించింది. ఇదిలా ఉంటే.. చైర్మన్‌ రేసులో మూడో వ్యక్తిగా ప్రచారంలో ఉన్న అభ్యర్థి డాక్టర్‌ ఏళ్ల వినయ్‌ సైతం నామినేషన్‌ వేయడంపై జనసేన నేతలు తలలుపట్టుకుంటున్నారు. దీనికితోడు వినయ్‌ సైతం తాను చైర్మన్‌ స్థానం కోసం ప్రయత్నాలు చేస్తున్నానని, పార్టీ బీఫారం తనకే లభిస్తుందని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. జనసేన అధిష్టానం ఆదేశాలతోనే వినయ్‌ నామినేషన్‌ వేసినట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తే జనసేనకు స్పష్టమైన వైఖరి ఉందా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇదిలా ఉంటే.. ఆదివారం మధ్యాహ్నం ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్యే పంతం నానాజీ, పెండెం దొరబాబు సమక్షంలో దానం లాజరుబాబు నామినేషన్‌ దాఖలు చేయడం పార్టీ శ్రేణులకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నామినేషన్ల ఉపసంహరణకు రెండు రోజులు ఉండటంతో జనసేన చైర్మన్‌ అభ్యర్థి విషయంలో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

ఫ డిప్యూటీ సీఎం పవన్‌

ఇలాకాలో రెబల్స్‌

ఫ పొత్తు ధర్మాన్ని ధిక్కరించి

టీడీపీ నేతల నామినేషన్లు

ఫ గొల్లప్రోలు, పిఠాపురం మున్సిపాలిటీల్లో

స్వతంత్రులుగా రంగంలోకి..

ఫ ఒక్కో వార్డుకు ఇద్దరు నుంచి

ముగ్గురు అభ్యర్థుల నామినేషన్‌

ఫ తెరవెనుక మంత్రాంగం

నడిపించిన టీడీపీ సీనియర్‌ నేత వర్మ

ఫ తలలు పట్టుకుంటున్న

జనసేన నాయకులు

నమ్మించి.. నట్టేట ముంచి

పిఠాపురం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి అభ్యర్థిత్వం ఖరారు చిచ్చు రేపింది. ఈ విషయంలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ నమ్మించి మోసం చేశారు. మున్సిపల్‌ పీఠం దక్కుతుందనే భరోసా, పార్టీ పెద్దల నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాల నేపథ్యంలో డాక్టర్‌ బీరా విజయశేఖర్‌ చైర్మన్‌ పోటీకి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తన ప్రభుత్వ ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. ఇక నామినేషన్‌ వేద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇంతలోనే పవన్‌ చివరి నిమిషంలో విజయశేఖర్‌ను చైర్మన్‌ రేసు నుంచి తప్పించారు. దానం లాజర్‌కు అవకాశం కల్పించారు. ఈ పరిణామంతో విజయశేఖర్‌ అవాక్కయ్యారు. తనను రాజకీయంగా నిండా ముంచారని, ఇచ్చిన మాట తప్పి నడిరోడ్డుపై నిలబెట్టారంటూ ఆయన సన్నిహితుల వద్ద కన్నీటి పర్యంతమైనట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement