పెద్దాపురం: సమయానికి అనుగుణంగా నడుకోవాలంటారు పెద్దలు. అలాంటి సమయం మించిపోవడంతో ఓ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాన్ని కోల్పోయింది. పెద్దాపురం మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ వేయడానికి ఆదివారం చివరి రోజు. స్థానిక బచ్చు గురుమూర్తి మున్సిపల్ ఆడిటోరియంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల లోపు నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులను మాత్రమే పోలీసులు లోపలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యువతి తన తండ్రితో కలసి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు పరుగులెత్తుకుంటూ మూడు గంటల దాటిన తరువాత నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకుంది. అయితే అప్పటికే గడుపు ముగిసిందని, నిబంధనల ప్రకారం కుదరదని అధికారులు సృష్టం చేయడంతో, చేసేది లేక ఆ తండ్రీ కూతుర్లు తీవ్ర నిరాశతో వెనుతిరిగారు.
నేడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదల కానుంది. దీనికి సంబంధించి ఈ నెల 21 నుంచి 23 వరకూ నామినేషన్లు అందజేయవచ్చు. ఎంపీటీసీలకు సంబంధించిన నామినేషన్లను ఆయా మండల కేంద్రాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో ఆర్వోలు ఉంటారు. జెడ్పీటీసీ నామినేషన్లను కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ అపూర్వ భరత్ స్వీకరిస్తారు. 24న నామినేషన్లు స్క్రూట్నీ, 25న అభ్యంతరాల స్వీకరణ, 26న అభ్యంతరాల పరిష్కారం, 27న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో 1,426 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
ఫొటో ఓటర్ల జాబితా
ప్రచురణకు 24 గడువు
కాకినాడ లీగల్: కాకినాడ నగరపాలక సంస్థలో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈ నెల 24న వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా ప్రచురణకు గడువు ఇచ్చింది. నగరపాలక సంస్థలో వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికలకు సంబంధించిన కోర్టు కేసులు, ఇతర సమస్యల కారణంగా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో 2026 జనవరి 1న ప్రామాణిక తేదీగా తీసుకుని ఓటర్ల జాబితా రూపొందించాలని అధికారులను ఆదేశించింది. అసెంబ్లీ ఓటర్ల జాబితాలోని సంబంధిత వివరాలను ఆధారంగా తీసుకుని నగరపాలక సంస్థ పరిధిలోని వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల ప్రకారం ఈ నెల 24న జాబితా ప్రచురణకు గడువు ఇచ్చారు.


