కాకినాడ రూరల్: దసరా ఉత్సవాల్లో దుర్గాష్టమి రోజు ఆదివారం రమణయ్యపేటలోని శ్రీపీఠం భక్తజన సంద్రంగా మారింది. మహాశక్తి యాగంలో భాగంగా కుంకుమార్చనలతో పాటు విశేష పూజలను పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. 2030 నాటికి వెయ్యి కోట్ల కుంకుమార్చనలు పూర్తి చేసే లక్ష్యంతో మహాశక్తి యాగం ప్రారంభించగా, ఈ సంవత్సరంతో 400 కోట్లు పూర్తవ్వనున్నాయి. 8వ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాదిగా తరలివచ్చిన భక్తులతో మూడు సార్లు లలితా సహస్ర నామాల పారాయణ చేయించడంతో 74 కోట్లకు కుంకుమార్చనలు చేరుకున్నాయి. మరో రెండో రోజుల్లో వంద కోట్ల కుంకుమార్చనలు పూర్తవుతాయని పరిపూర్ణానంద స్వామి వెల్లడించారు. దుర్గాష్టమి సందర్భంగా అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఐశ్వర్య పూజలో భాగంగా చండీ సప్తశతిలోని కవచం, అర్గళం, కీలకం, స్తోత్ర చతుష్టయం, సిద్ధ కుంజికా స్తోత్రం తదితర పారాయణ చేశారు. దీపాన్ని దైవ స్వరూపంగా భావించి, దాని కాంతిలో దర్శనమిచ్చే అమ్మవారి రూపం భక్తుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోవాలనే సంకల్పంతో ఈ పూజ నిర్వహించినట్టు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. మనిషి జీవితంలో కోరికలు వయసు, కుటుంబ పరిస్థితులను బట్టి మారుతాయని పేర్కొన్నారు. దసరా రోజున సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తామన్నారు. సోమవారం నవమి రోజున అమ్మవారికి లక్ష బూరెలతో అభిషేకం చేస్తామని, భక్తులు స్వయంగా ఐదు బూరెలు చొప్పున వండి తీసుకురావాలని కోరారు.
ఫ దుర్గాదేవిగా ఐశ్వర్యాంబిక అమ్మవారు
ఫ వంద కోట్లకు చేరువలో
కుంకుమార్చనలు


