సామర్లకోట చైర్మన్ అభ్యర్థిగా జాన్‌మోజెస్
సామర్లకోట: వైఎస్సార్ సీపీ సామర్లకోట చైర్మన్ అభ్యర్థిగా ఉబా జాన్‌మోజెస్ నామినేషన్ దాఖలు చేశారు. శనివారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, ఆదివారం మరో రెండు సెట్లు వేశారు. సామర్లకోట మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. దాంతో వైఎస్సార్ సీపీ నుంచి ఉబా జాన్‌మోజెస్, కూటమి నుంచి పిట్టా జానకిరామారావు (జనసేన), కాంగ్రెస్ అభ్యర్థిగా నూతాటి అశోక్ నామినేషన్లు వేశారు. ఉబా జాన్‌మోజెస్ వైఎస్సార్ సీపీలో సీనియర్ నాయకుడిగా, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెండు పర్యాయాలు ఆయన కౌన్సిలర్‌గా, ఒక పర్యాయం కోఆప్షన్ సభ్యుడిగా, గత పాలక మండలిలో వైస్ చైర్మన్‌గా పని చేశారు. మోజెస్‌కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండటంతో సులభంగా ఆయన విజయం సాధించే అవకాశాలున్నాయి. ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లోనూ మోజెస్‌కు మంచి పట్టు ఉంది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసి గుర్తింపు పొందారు. వైస్ చైర్మన్‌గా మున్సిపాలిటీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. డిగ్రీ చదివిన ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. సుమారు 25 ఏళ్ల క్రితం ఆయన రాజకీయ ప్రవేశం చేశారు.
పెద్దాపురం చైర్మన్ అభ్యర్థిగా సౌందర్యలక్ష్మి
పెద్దాపురం: స్థానిక మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ సీపీ చైర్పర్సన్ అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ కాపుగంటి సౌందర్యలక్ష్మి పార్టీ అధిష్టానం సూచనలతో నామినేషన్ వేశారు. ఈ మేరకు పెద్దాపురం బచ్చు గురుమూర్తి మున్సిపల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఆమె నామినేషన్ దాఖలు చేశారు. గతంలో వైఎస్సార్ సీపీ తరఫున ఆరో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేసి ఆమె విజయం సాధించారు. అలాగే ఆమె అత్తయ్య కాపుగంటి విమల మున్సిపల్ వైఎస్ చైర్మన్‌గా పనిచేశారు. దీంతో రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నాయి. అదే ఆమె విజయానికి బాటలు వేస్తాయని భావిస్తున్నారు.


