కాకినాడ రూరల్: మనసులో కల్మషం, ద్వేషం, కుట్రలకు తావీయకుండా ముందుగా మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలని కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. మహాశక్తి యాగం విజయ దశమి పర్వదినమైన మంగళవారం ముగియనుంది. వంద కోట్ల కుంకుమార్చనలే లక్ష్యంగా దేవీ శరన్నవరాత్రుల ప్రారంభం రోజున ఈ మహాక్రతువు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కుంకుమార్చనలు పదో రోజుతో వంద కోట్ల లక్ష్యానికి చేరుకోనున్నాయి. తొమ్మిదో రోజైన సోమవారం వేలాదిగా హజరైన మహిళలతో స్వామీజీ మూడుసార్లు కుంకుమార్చనలు జరిపించారు. హోమశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు. పీఠం అధిష్టాన దేవత ఐశ్వర్యాంబిక అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారికి వెయ్యి శ్రీసూక్త పారాయణలు జరిపించారు. స్వామీజీ మాట్లాడుతూ, అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్టేనని అన్నారు. ప్రతి రోజూ 24 నిమిషాలు కేటాయించి, లలితా సహస్ర నామ పారాయణ చేయడం ద్వారా అమ్మ వెన్నంటే ఉంటుందని చెప్పారు. మంగళవారం సహస్ర కలశాభిషేకం, దీక్షాంత స్నపనం, సాయంత్రం దీక్షాంత కల్యాణం నిర్వహిస్తామన్నారు. మహాశక్తి యాగం సజావుగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.


