పిఠాపురం: ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో అదునుకు నీరు లేదు.. నారు లేదు.. తీరా ఆలస్యంగా నీరు వచ్చాక పంటలు వేస్తే తీవ్ర వాయుగుండం తోడుగా వరుణుడు కన్నెర్ర చేశాడు. ఫలితంగా వరద ముంపుతో వేసిన పంటలు కాస్తా నాశనమయ్యాయి. పెట్టుబడులు నీళ్లపాలయ్యాయి. దీంతో, తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చిందంటూ రైతులు గొల్లుమంటున్నారు. వేసిన పంటలు కుళ్లిపోవడంతో.. సాకిన చేతులతోనే ఆ మొక్కలను పీకి పారేయాల్సిన దుస్థితిని అన్నదాతలు ఎదుర్కొంటున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో, ఆదుకునే నాథుడు లేక అన్నదాతలు ఆక్రందనలు పెడుతున్నారు.
ముంచెత్తిన వానలు
పిఠాపురం నియోజకవర్గంలో రైతులు 3,500 ఎకరాల్లో పత్తి, మొక్కజొన్న, మిరప, అరటి వంటి వాణిజ్య పంటలు, కూరగాయల తోటలు సాగు చేశారు. ప్రతి ఎకరాకు రూ.వేలల్లో పెట్టుబడి పెట్టారు. నెలల తరబడి వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో.. అప్పు లు తెచ్చి మరీ పంటకు తడి అందించారు. పంట ఏపుగా ఎదగడానికి నానా కష్టాలూ పడ్డారు. చేతికి అందివస్తుందనుకున్న దశలో గత వారంలో వచ్చిన తీవ్ర వాయుగుండం వారి ఆశలను ముంచేసింది. ఎడతెరిపి లేకుండా మూడు రోజుల పాటు కురిసిన వర్షాలకు తో డు ఏలేరు జలాలు వందల ఎకరాల్లో వాణిజ్య పంటల ను ముంచెత్తాయి. రోజుల తరబడి నీరు దిగకపోవడంతో ముఖ్యంగా గొల్లప్రోలు మండలంలో వాణిజ్య పంటలు కుళ్లిపోతున్నాయి. పశువుల మేతకు కూడా పనికిరాని విధంగా దుర్గంధం వెదజల్లుతున్నాయి. ఈ పంటను అలాగే ఉంచితే భూసారం దెబ్బ తిని, తర్వాతి పంటకు ఇబ్బంది అవుతుంది. దీంతో, గత్యంతరం లేని పరిస్థితుల్లో తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ.. బాధిత రైతులు టమాటా, బంతి, పత్తి, మిరప, కాలీఫ్లవర్ వంటి పంటలను పీకి పారేస్తున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మల్లవరం, తాటిపర్తి, చెందుర్తి తదితర గ్రామాల్లో సుమారు 200 ఎకరాల్లో వాణిజ్య పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. ఇప్పటికే సుమారు 40 ఎకరాల్లో పంటలను రైతులు పీకేశారు. మిగిలిన పంటలు తొలగించడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పెట్టుబడి సంగతి అలా ఉంచితే.. చేసిన అప్పులు ఏవిధంగా తీర్చాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
అన్నదాతకు గుండె కోత మిగిల్చిన వరద
గొల్లప్రోలు మండలంలో
కుళ్లిపోతున్న వాణిజ్య పంటలు
సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం
కోత కోసే వీలు లేక పెంచిన
చేతులతోనే పీకి పారేస్తున్న రైతులు
ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆవేదన
పరిహారం ఊసే లేదు
ఒకవైపు పంటలు కుళ్లిపోయి తీవ్ర నష్టాల పాలైనప్పటికీ.. అధికారులు పరిశీలించడం తప్ప.. పరిహారం గురించి ప్రస్తావించడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. దెబ్బ తిన్న ప్రతి ఎకరాకూ ప్రభుత్వం తక్షణం పరిహారం చెల్లించాలని, అధికారులు ప్రాంతాల వారీగా పర్యటించి, నష్టపోయిన ప్రతి రైతుకూ న్యాయం జరిగేలా పారదర్శకంగా సర్వే చేయాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేయడంతో పాటు, తదుపరి పంటలు వేసుకోవడానికి ఉచితంగా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాలం కలసిరాక, ప్రకృతి విపత్తుతో సర్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


