బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నగరంలో నిరుద్యోగులు, ప్రజాసంఘాల నాయకులపై అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలను వెంటనే ఆపాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు కరణం ప్రసాదరావు, కె.బోడకొండ, పౌర సంక్షేమ సంఘం నాయకుడు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, కాకినాడలో ప్రభుత్వ, పోలీసు నిరంకుశ చర్యలను తీవ్రంగా ఖండించారు. పోలీసు నిరుద్యోగ అభ్యర్థులు తమ భవిష్యత్తు కోసం శాంతియుతంగా ఆందోళన చేసి, ప్రభుత్వానికి విన్నపాలు చేయడం నేరమా అని ప్రశ్నించారు. ఉద్యమిస్తున్న వారికి ప్రజాసంఘాలు అండగా నిలవడం దేశద్రోహమా అని నిలదీశారు. రెండు వారాలుగా కాకినాడలో పోలీసులు అనుసరిస్తున్న నిర్బంధ చర్యలు రాజ్యాంగ హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ముందు ప్రకటించినట్లుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ అభ్యర్థులను బెదిరించడం, బైండోవర్ కేసులు పెట్టడం మానుకోవాలన్నారు. నగరంలో గంజాయి, మత్తు పదార్థాల బారిన పడి యువత భవిష్యత్తు నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు నగరంలో హత్యలు పెరుగుతూ శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణకు సమయం కేటాయించాల్సింది పోయి, ప్రభుత్వానికి తమ గోడు వినిపించే నిరుద్యోగులు, ప్రజాసంఘాలపై ఉక్కుపాదం మోపడం సమంజసంగా లేదని అన్నారు. కార్యక్రమంలో దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్‌కుమార్, పలివెల వీరబాబు, టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


