కాకినాడ లీగల్: గత వారంలో కురిసిన వర్షాలతో ముంపునకు గురై, రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాకినాడ 43, 48, 49 వార్డులను కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ సోమవారం పరిశీలించారు. ముంపు నీటిని వెంటనే తొలగించి ప్రజలకు రాకపోకలు సులభతరం చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్‌వీవీ సత్యనారాయణను ఆదేశించారు. 49వ వార్డులోని మధురా నగర్, అశోక్ నగర్ ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. 48వ వార్డు జనచైతన్య నగర్ కాలనీ వద్ద గాడేరు కాలువను పరిశీలించి, నీటి ప్రవాహానికి అడ్డంకిగా ఉన్న గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. 43వ వార్డు ట్రెజరీ కాలనీ ప్రాంతాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పునరావాస కేంద్రాన్ని సందర్శించి, అక్కడ ఆశ్రయం పొందుతున్న బాధితులతో మాట్లాడారు. బాధితులకు కలెక్టర్ స్వయంగా భోజనం వడ్డించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వర్షాల కారణంగా వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువలను ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న వారికి నోటీసులు జారీ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.


