పరిష్కారం పూజ్యం | - | Sakshi
Sakshi News home page

పరిష్కారం పూజ్యం

Sep 29 2026 12:39 AM | Updated on Sep 29 2026 12:39 AM

వితంతు పింఛను ఇవ్వడం లేదు

అనారోగ్యంతో నా భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. వితంతు పింఛను ఇవ్వాలని రెండేళ్ల క్రితం అర్జీ ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదు. నాకు 11 సంవత్సరాల అబ్బాయి, మూడేళ్ల అమ్మాయి ఉన్నారు. చిన్న పిల్లలు కావడంతో వారిని ఇంటి వద్ద ఉంచి పనికి వెళ్లేందుకు కూడా కుదరడం లేదు. వారిని ఎలా పోషించాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.

– చందక చంటమ్మ,

రాజపూడి, జగ్గంపేట మండలం

భూమి ఆక్రమించుకుని

ఇవ్వడం లేదు

మా గ్రామంలో నాకున్న రెండు సెంట్ల భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకున్నాడు. దీనిపై రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా స్థానిక వీఆర్‌ఓ స్పందించడం లేదు. కలెక్టరేట్‌కొచ్చి ఇప్పటికి మూడుసార్లు ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. ప్రతిసారీ మా ఊరి నుంచి కాకినాడ రావడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాను.

– కడియాల వెంకట రమణ, తాళ్లరేవు

● పీజీఆర్‌ఎస్‌లో పదేపదే అర్జీలు

● సమస్యలు పరిష్కారం కావడం

లేదని అర్జీదారుల ఆవేదన

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): స్థానికంగా అర్జీలు ఇస్తు న్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో దూర ప్రాంతమైన కాకినాడ కలెక్టరేట్‌కు వస్తున్నామని, ఇక్కడా అదే పరిస్థితి ఎదురవుతోందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమంలో అర్జీలు సమర్పిస్తున్నా సకాలంలో సరైన పరిష్కారం దొరకడం లేదని వాపోతున్నారు. నెలలు, సంవత్సరాల తరబడి తిరుగుతున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా పరిస్థితి ఉందని పెదవి విరుస్తున్నారు. పింఛన్లు, రేషన్‌ కార్డులు, భూ సమస్యల వంటివి పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రాల్లో అధికారులు స్పందించక జిల్లా కేంద్రాలకు వచ్చి అర్జీలు ఇస్తున్నామని, వీటికి కూడా సంవత్సరాల తరబడి సమయం తీసుకోవడం దారుణమని అంటున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, వివిధ శాఖల అధికారులు మొత్తం 468 అర్జీలు స్వీకరించారు. ఈ నెల 14న వినాయక చవితి, ఈ నెల 21న ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో రెండు సోమవారాలు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమం జరగలేదు. దీంతో, ఈ వారం అర్జీలు సమర్పించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో కలెక్టరేట్‌ కిటకిటలాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement