కాకినాడ రూరల్: రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యాన కాకినాడలో పని చేస్తున్న రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ (ఎస్‌ఐఎఫ్‌టీ) ల్యాబ్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేటింగ్ లేబొరేటరీస్ (ఎన్‌ఏబీఎల్) నుంచి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు పొందిన మొట్టమొదటి ఆక్వా ల్యాబ్ ఇదే కావడం విశేషం. ఈ ల్యాబ్‌లో 61 రకాల పరీక్షలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నారు. నీరు, మట్టి నాణ్యత విశ్లేషణ, చేపలు, రొయ్య పిల్లల నాణ్యత విశ్లేషణ, ఆక్వా ఫీడ్ విశ్లేషణ, మైక్రో బయాలజీ పరీక్షల వంటి సేవలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కొత్తగా ఎల్‌సీఎంఎస్‌ఎంఎస్, జీసీఎంఎస్‌ఎంఎస్ ల్యాబ్ సేవ లు అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తులను మరింత పెంచి, ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఈ గుర్తింపు ఉపయోగపడుతుందని, ఆక్వా రైతులు తమ ల్యాబ్ సేవలను వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్, మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ ఎస్.అంజలి కోరారు.
ఫ మాఘ.. బహుబాగా..
ఈ చిత్రంలో కనిపిస్తున్న చేప పేరు ‘మాఘ’. దీనిని ఇండియన్ సాల్మన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. సముద్రంలో లభ్యమయ్యే ఈ చేపలో ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండటంతో పాటు కొలెస్ట్రాల్ ఉండదు. ఈ చేపలు సాధారణంగా చిన్న సైజు నుంచి 10 కిలోల వరకు లభ్యమవుతాయి. అటువంటిది కాకినాడ తీరంలో మత్స్యకారులకు చిక్కిన ఈ మాఘ చేప ఏకంగా 26 కిలోల బరువు తూగింది. దీనికి కుంభాభిషేకం రేవు వద్ద సోమవారం వేలం నిర్వహించగా రూ.16 వేల ధర పలికింది.
– కాకినాడ రూరల్


