తుని: రైలులో గంజాయి తరలిస్తున్న యువతిని, యువకుడిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తున్న సుభద్ర సమాల్, దీపక్ కుమార్ జన హౌరా – చైన్నె మెయిల్‌లో ప్రయాణిస్తున్నారు. వారి బ్యాగులో 13 కేజీల గంజాయి ఉన్నట్లు స్థానిక ఆర్‌పీఎఫ్ ఎస్సైకి సమాచారం అందింది. అప్రమత్తమైన రైల్వే పోలీసులు తునిలో ఆ రైలు జనరల్ కోచ్ తనిఖీ చేసి నిందితులను అదుపులోకి తీసుకుని, వారి బ్యాగులో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శనివారం కోర్టులో హాజరు పరచనున్నారు. ఈ కేసును ఛేదించిన ఆర్‌పీఎఫ్ ఎస్సై శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్‌పీ) ఎస్సై సత్తిబాబు, సిబ్బందిని కాకినాడ లైన్ ఇన్‌స్పెక్టర్ అభినందించారు.
చాక్లెట్ల రూపంలో గంజాయి స్వాధీనం
రైలులో చాక్లెట్ల రూపంలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు జీఆర్‌పీ ఎస్సై సత్తిబాబు తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హౌరా – చైన్నె మెయిల్‌ను తునిలో తనిఖీ చేస్తూండగా అందులో ప్రయాణిస్తున్న మనోజ్ ప్రధాన్, సంబునాథ్ జన, అజయ్ జన అనుమానాస్పదంగా ఒకటో నంబర్ ప్లాట్‌ఫారంపై రైలు దిగి వెళ్లిపోతున్నారు. వారిని ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది అదుపులోకి తీసుకుని, వారి నుంచి చాక్లెట్ రూపంలో ఉన్న మూడు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.


