పొద్దున లేస్తే ధరల ఉప్పెన.. కూరగాయలు కొంటే సగటు జీవికి తప్పని ఆక్రందన.. ఖాళీ అవుతున్న నూనె డబ్బా, తరిగిపోతున్న బియ్యం బస్తా వైపు చూస్తే గుండె నిండా ఆందోళన.. ధరల మంటలో పప్పులు, ఉప్పులు, గ్యాస్‌ బండలు ఉంటే, సగటు జీవికి మిగులుతున్నది ఆవేదన.. చంద్రబాబు సర్కార | - | Sakshi
Sakshi News home page

పొద్దున లేస్తే ధరల ఉప్పెన.. కూరగాయలు కొంటే సగటు జీవికి తప్పని ఆక్రందన.. ఖాళీ అవుతున్న నూనె డబ్బా, తరిగిపోతున్న బియ్యం బస్తా వైపు చూస్తే గుండె నిండా ఆందోళన.. ధరల మంటలో పప్పులు, ఉప్పులు, గ్యాస్‌ బండలు ఉంటే, సగటు జీవికి మిగులుతున్నది ఆవేదన.. చంద్రబాబు సర్కార

Sep 21 2026 12:20 AM | Updated on Sep 21 2026 12:20 AM

కోయాలంటే కూరగాయాలే..

సంచి పట్టుకుని మార్కెట్‌కెళితే గుండె జారిపోతోంది. వంకాయ వామ్మో అనిపిస్తోంది. బెండకాయ బెట్టు చేస్తోంది. ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు అన్నట్టు తయారైంది. కిలో చిక్కుళ్లు రూ.100కు చేరుకొంది. కిలో వంకాయలు గతంలో రూ.20 ఉండగా, ప్రస్తుతం రూ.40కి పెరిగింది. ధరలు అధికంగా ఉన్న రోజుల్లో కొన్ని కూరగాయలను కొనకుండా ప్రత్యామ్నాయాలతో వంట చేసుకోవాల్సి వస్తోందని గృహిణులు చెబుతున్నారు.

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ధరల మంట అగ్ని పర్వతమైంది.. సామాన్యుడి గుండెల్లో అలజడికి కారణమవుతోంది.. ధరలు కోరలు చాస్తుంటే, సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవనం భారంగా మారుతోంది. ఒకవైపు వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పు లేకపోయినా, మరోవైపు ఇంటి ఖర్చులు మాత్రం పెరుగుతుండటంతో కుటుంబ బడ్జెట్‌ తారుమారవుతోంది. ఉప్పు నుంచి పప్పు వరకు.. నూనెలు, బియ్యం, కూరగాయలు, ఉల్లిపాయలు ఒకటేమిటి అన్ని ధరలూ సామాన్యుడి నెత్తిన బండలా మారాయి. గతంలో నెలకు కొంత మొత్తంతో కుటుంబ అవసరాలకు సర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉండగా, ప్రస్తుతం అదే వస్తువులకు రెట్టింపు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో జీతాలు, ఆదాయాలు పరిమితంగానే ఉండటంతో ధరల పెరుగుదలను తట్టుకోవడం కష్టంగా మారుతోంది. ఒక సాధారణ కుటుంబం ఇంటి అద్దె, విద్యుత్‌ బిల్లు, పిల్లల చదువులు, వైద్యం, ప్రయాణ ఖర్చులతో పాటు ఆహార పదార్థాల కోసం ప్రతిరోజూ గణనీయమైన మొత్తాన్ని వెచ్చించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో కూరగాయలు, పప్పులు, నూనెలు వంటి వాటి ధరలు పెరగడంతో కుటుంబ సభ్యుల అవసరాలను తగ్గించుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అల్పాదాయ వర్గాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

ఒక్కసారిగా ‘ఉల్లి’క్కిపాటు

కోస్తేనే కన్నీళ్లు తెచ్చే ఉల్లిపాయ, ఈ రోజుల్లో మార్కెట్‌లో దాని ధర చూస్తేనే కళ్లలో నీరు తెప్పిస్తోంది. కూరల్లో ఉల్లి లేకపోతే రుచి లేదు.. మార్కెట్‌లో కొనేందుకు జేబులో డబ్బు లేదు! బంగారంతో పోటీ పడుతున్నట్టు ఉల్లి రేటు పెరుగుతోంది. గత నెల రోజుల వ్యవధిలో ఉల్లిపాయ ధర గణనీయంగా పెరిగింది. కర్నూలు తదితర ప్రాంతాల నుంచి సాధారణంగా వచ్చే ఉల్లిపాయల సరఫరాలో మార్పులు రావడం, ఇతర ప్రాంతాల నుంచి సరుకు తీసుకురావాల్సి రావడం వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు హోల్‌సేల్‌ మార్కెట్‌లో భారీగా సరకును నిల్వ ఉంచడం, డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా లేకపోవడం వంటి అంశాలు కూడా ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లి ధర రూ.65 పైమాటే ఉంది. నెల రోజుల్లో కిలో రూ.25 నుంచి ఈ మొత్తానికి పెరిగిపోవడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

ముద్ద దిగక..

పెరుగుతున్న బియ్యం ధరతో సామాన్యుల నోటికి ముద్ద చేరడం లేదు. రేషన్‌ బియ్యం తినలేక, బయట మార్కెట్‌లో కొనలేక సామాన్యులు నలిగిపోతున్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలు సైతం నాణ్యతను బట్టి మార్కెట్‌లో బియ్యం కొనుగోలు చేయాల్సి వస్తోంది. వివిధ రకాల బియ్యం ధరలు పెరగడంతో నెలకు అవసరమైన బియ్యం కోసం అదనపు ఖర్చు అవుతోంది. 25 కిలోల సన్న బియ్యం బస్తా రూ.2 వేలు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. నెల రోజుల క్రితం అదే బస్తా రూ.1400 ఉండగా, ఒక్కసారిగా రూ.600 పెరిగింది.

పచ్చడి మెతుకులతో సరి

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం అత్యధికంగా పేద కుటుంబాలపైనే పడుతోంది. ఆదాయం తక్కువగా ఉండటంతో అవసరమైన అన్ని వస్తువులనూ కొనుగోలు చేయలేకపోతున్న కుటుంబాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పప్పులు, కూరగాయలు, నూనె వంటి వాటిని తగ్గించుకుని కేవలం అన్నం, పచ్చడితోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆయా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే విద్య, వైద్యం, ఇల్లు, ప్రయాణం వంటి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ఆహార పదార్థాల ధరలు కూడా పెరగడంతో పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇది చాలదన్నట్టు పిల్లల ఫీజులు, ఏదైనా సుస్తి చేసినా వైద్య ఖర్చులు అధికం అవుతున్నాయి. అంతేకాకుండా ఇంటి అద్దెకు కూడా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇలా ప్రతి నెలా సామాన్యుడు అష్టకష్టాలు పడుతున్నాడు. అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు.

కిలోకి రూ.20 మేర

పెరిగిన సన్నబియ్యం ధర

కిలో రూ.70 దాటేసిన పంచదార

రేషన్‌ డిపోల్లోనూ చక్కెర ఇవ్వడం

లేదని వినియోగదారుల ఆవేదన

కోయకముందే

కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి, అల్లం, వెల్లుల్లి

నిత్యావసరాల ధరాభారంతో

అల్లాడిపోతున్న సామాన్య కుటుంబాలు

ధరల నియంత్రణలో

చంద్రబాబు ప్రభుత్వం విఫలం

ధరలోనూ నెగ్గుతూ..

వంటింట్లో నూనె ప్యాకెట్‌ చింపాలంటేనే చేతులు జారిపోతున్నాయి.. తాలింపు పెట్టాలంటేనే కన్నీళ్లు వస్తున్నాయి.. ధరల రేసులో నూనె ఎక్కడా తగ్గడం లేదు. గరిటెడు ఆయిల్‌ వేసే చోట, బొట్టు బొట్టుగా కొలిచి పోసే కాలమొచ్చింది. ఈ ధర కుటుంబ బడ్జెట్‌ను ప్రభావితం చేస్తోంది. నెలవారీ సరకులు కొనుగోలు చేసే సమయంలో నూనెకు కేటాయించాల్సిన మొత్తం పెరుగుతోందని గృహిణులు చెబుతున్నారు. లీటరు వేరుశెనగ నూనె గతంలో రూ.160 ఉండగా, ప్రస్తుతం రూ.210కి చేరింది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.155 నుంచి రూ.185కు పెరిగింది. ఇది ఎక్కడా దిగిరావడం లేదు. పంచదార, బెల్లం ధర చూస్తే నోరు చేదెక్కుతోంది. మిగతా నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరగడంతో తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు బడ్జెట్‌ కేటాయింపులకు ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. ఇంధన ధరలు, రవాణా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర రూ.117కు చేరడం గమనార్హం. అయితే రవాణా ఖర్చుల పెరుగుదలను సాకుగా చూపుతూ కొందరు వ్యాపారులు ధరలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement