కొత్తపల్లి: ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ సోమవారం నియోజకవర్గంలో పర్యటించనున్నవేళ జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తొలి నుంచీ పార్టీ కోసం కష్టపడిన తమకు గౌరవం, సముచిత స్థానం దక్కడం లేదని మరో వర్గం నేత మండిపడ్డారు. పార్టీ కార్యక్రమాలు తెలియపరచకుండా రాజకీయం చేస్తున్నాడంటూ పార్టీ మండల అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని పొన్నాడ శివారు కోనపాపపేటలో ఉన్న కన్వెన్షన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేగిశెట్టి సూర్య నిఖిల్, మత్స అప్పాజీ, తెలగంశెట్టి వెంకటేశ్వరావు, రాష్ట్ర ఆక్వా డైరెక్టర్ వంక కొండబాబు, ధనబాబు ఈ విషయాలు వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన తమకు విలువ లేకుండా పోయిందంటూ ఫైవ్‌మెన్ కమిటీ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని, పవన్ దృష్టికి తీసుకెళ్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పార్టీని రెండు వర్గాలుగా విభజించి ప్రభుత్వానికి సంబంధించిన లబ్ధిని తన వర్గానికే కట్టబెడుతున్నారని విమర్శించారు. ఫైవ్‌మెన్ కమిటీ అలాంటివారికే మద్దతిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పటికై నా దృష్టిపెట్టి.. పార్టీ మండల అధ్యక్షుడి తీరుపై, అక్రమాలపై విచారణ చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకట రమణ, మరిశెట్టి సత్తిబాబు, దావీదు తదితరులు పొల్గొన్నారు.
ఆ పార్టీ మండల అధ్యక్షుడిపై విమర్శలు
అక్రమాలు జరిగాయని
బహిరంగంగా వెల్లడి
ఎవరి దృష్టికి తీసుకెళ్లినా
పట్టించుకోవడం లేదని ఆవేదన


