పిఠాపురం: ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోవడం, గృహ నిర్బంధాలకు పాల్పడడం చట్ట వ్యతిరేకమని, అప్రజాస్వామికమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా ప్రధాన కార్యదర్శి గుదిమెళ్ళ శ్రీభాస్కరాచార్యులు తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని పోలీసులు గుర్తుంచుకోవాలన్నారు. చట్ట ప్రకారం, నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన పోలీసులు వాటిని పక్కనపెట్టి అధికార పార్టీ మెప్పు కోసం కాకినాడ జిల్లాలో సీపీఎం, సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో పోలీస్ స్టేషన్లకు తరలించడం, గృహనిర్బంధాలకు పాల్పడటం, వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇటువంటి పద్ధతులు ప్రజాస్వామ్యంలో మంచివి కాదని హితవు పలికారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుని పనిచేసే పోలీసులు ప్రజల సమస్యలు ప్రజాప్రతినిధులకు చెప్పుకునేందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం అన్యాయమన్నారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, మంత్రులకు వారు జిల్లాకు వచ్చినప్పుడు ఆ ప్రజలు సంఘాల ఆధ్వర్యంలో తమ కష్టాలు, సమస్యలు చెప్పుకొనే, వినతి పత్రాలు సమర్పించుకునే అవకాశం లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో సీపీఎం, సీఐటీయూ ప్రజా సంఘాల నేతల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు పోలీసులు దిగారని తెలిపారు. కాకినాడ రూరల్ మండలం సీఐటీయూ కార్యదర్శి టి.రాజా ఆసుపత్రి పనిమీద వెళ్తున్నప్పటికీ అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. భవిష్యత్తులో జిల్లాలో ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన సందర్భంగా ప్రతిపక్షాల, ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకోకుండా, గృహనిర్బంధాలకు పాల్పడకుండా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జిల్లా ఎస్పీ, కలెక్టర్లకు ఇవ్వాలని, ప్రజల ప్రజాస్వామిక హక్కులు, రాజ్యాంగపరమైన హక్కులు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఐలు జిల్లా ప్రధాన కార్యదర్శి
గుదిమెళ్ళ శ్రీ భాస్కరాచార్యులు


